– ఫ్యామిలీ పెన్షన్‌ను 30 శాతానికి పెంచాలి : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ జాయింట్ ఫోరం ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫ్యామిలీ పెన్షన్‌ను 30 శాతానికి పెంచాలనీ, 2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే సెటిల్ చేయాలని నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగుల జాయింట్ ఫోరం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, జీఐఈఏఐఏ హైదరాబాద్ బ్రాంచి ప్రధాన కార్యదర్శి శివశంకర్, జీఐపీఏ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్‌రెడ్డి, హెచ్‌ఆర్‌జీఐఈఏ ప్రధాన కార్యదర్శి వై.సుబ్బారావు, ఓఐసీఓఏ అధ్యక్షులు సబింద్రసింహ, ఎన్‌ఐసీఓఏ అధ్యక్షులు శశికాంత్, ఎన్‌ఐఏఓఏ అధ్యక్షులు ఎ.నారాయణరావు, తదితరులు ప్రసంగించారు. యాజమాన్యం వాటాను ఎన్‌పీఎస్ ఉద్యోగులకు 14 శాతం పెంచాలనీ, పెన్షన్ అప్డేషన్ సదుపాయం కల్పించాలని కోరారు. ఉద్యోగులందరికీ 1995 పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను బలోపేతం చేసి పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.