పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి

– లక్ష్మాపురం నిర్వాసితులకు ఆర్అండ్ ప్యాకేజీ ప్రకటించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మర్రిగూడ మండలంలోని శివన్న గూడెం రిజర్వాయర్ లక్ష్మాపురం నుండి దేవరకొండ మండలం గొట్టిముకుల రిజర్వాయర్ పనులను, నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కిష్టరాయన్పల్లి రిజర్వాయన్ పనులను పార్టీ జిల్లా ప్రతినిది బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ఆకాంక్ష మేరకు ప్రారంభించిన ప్రాజెక్టులను కాంగ్రెన్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కిష్ణరాయన్పల్లి రిజర్వాయర్ ముంపు గ్రామమైన లక్ష్మాపురం నిర్వాసితులకు ఆర్ ఎం ఎస్ ప్యాకేజీని ప్రకటించి వారికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ లేకుండానే నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులనే చేయకుండా డీపీఆర్ అప్రూవల్ తీసుకొని ప్రాజెక్టు పనులు, కాలువల నిర్మాణాలు చేయాలన్నారు. డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల నిర్మాణాలను గత ప్రభుత్వం 10 ఏండ్లుగా నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి అధిక నిధులు కేటాయించి డీపీఆర్ అప్రూవల్ తీసుకొని పర్యావరణ అనుమతులు పొంది త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తిచేసి మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలలోని మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వద్ద సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాలప్రమీల, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, నాంపల్లి చంద్రమౌళి, ఎండి. సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్లా వెంకటయ్య, మండల నాయకులు సైదులు, ఏర్పుల యాదయ్య, మిరియాల వెంకన్న, బొట్టు శివకుమార్, ధనంజయ గౌడ్, ముత్తి లింగం, శివలింగం, శ్రీను, మల్లేశ్, కొమ్ము లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.