– మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
– సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
నవతెలంగాణ-జగదేవ్‌పూర్
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూసిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని గురువారం డిమాండ్ చేశారు. జగదేవ్‌పూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు 8 గ్రామాల్లో జీతాలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని వాటిని అమలు చేయాలని కోరారు. కార్మికులందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనీ 60 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. అలాగే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని, అకస్మాత్తుగా ఎవరైనా మరణిస్తే చావు ఖర్చులు రూ.30 వేలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు యాదగిరి, కిష్టయ్య ,అనిల్, అర్జున్, మధు, స్వామి, బాబు, భూషణం, సాయిలు, బిక్షపతి, యాదగిరి, గంగవ్వ, విజయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నంగునూరు
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు ఆనగోని పర్శరాములు గౌడ్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో నంగునూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఒక రోజు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు పర్శరాములు గౌడ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అధికారంలోకి వచ్చాక తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచిందని అన్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల కోసం ప్రభుత్వం ఏమి చర్చించకుండానే ముగించిందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడైనా గ్రామపంచాయతీ కార్మికులుగా గుర్తించి నెలకు రూ.18 వేలు జీతాలు పెంచుతూ, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 నీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండలం సీఐటీయూ అధ్యక్షులు దేవులపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు పిల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి చిట్యాల కనకయ్య, జీడికంటి కనకవ్వ, బాల్ నర్సమ్మ ,పోశవ్వ, అంకన పర్శరాములు, దుబ్బుల శేఖర్, దండం యాదగిరి, మల్లమారి బలరాం తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొండపాక
గ్రామ పంచాయతీలలో వివిధ విభాగాలలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు పెట్టిన మల్టీ పర్పస్ విధానం వద్దని, కేవలం రెగ్యులర్ ముద్దని సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య అన్నారు. గురువారం ఒక్క రోజు సఫాయి బంద్ సందర్భంగ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐఓసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కార్మికులు ఎవరి పనులు వారికే ఉండేదని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అట్టి విధానాన్ని తొలగించి మల్టీ పర్పస్ అనేది తీసుకొచ్చిందని దీంతో శానిటేషన్ కార్మికులతో బలవంతంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లు నడిపించగా బోల్తాలు పడి కార్మికులు మరణించారని అట్టి కార్మికుల కుటుంబాలకు ఎటువంటి పరిహారం కానీ న్యాయం జరగలేదని. నాటి పాలకులు చేయలేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పి నేటికీ న్యాయం చేయలేదని అన్నారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు కార్మికుల అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు. మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కారోబార్‌లను, బిల్ కలక్టర్‌లను, జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్‌లు ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైరల్ జ్వరాలతో ఇంటికే పరిమితమైన కార్మికులకు ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కోరారు. పని చేస్తున్న వారందరినీ తీర్మనాలతో సంబంధం లేకుండా పర్మినెంట్ చేయాలని, అనారోగ్య బాధితులకు తక్షణ సాయం కింద పది వేల రూపాయలు ఇవ్వాలని, పౌష్టికాహారం అందించాలని, కోరుతూ నేడు సఫాయి బంద్ జరిగిందని తెలిపారు. ఇంతటితో ఈ పోరాటం ఆగదని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బర్మ కొమురయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు పల్లే శ్రీనివాసు, జాలిగామ ప్రభాకర్, కుకునూరు పల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు భోగి సాయికుమార్ ఫోటోల నరహరి గడ్డల మల్లవ్వ, దున్నమనేమ్మ గొడుగు నారాయణ, కొండపాక, కుకునూరుపల్లి మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస ్‌అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై రాష్ట్రంలోనే 12,769 గ్రామపంచాయతీలలో 52 వేల మంది కార్మికులు మల్టీపర్పస్ వర్కర్ తో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ పేరుతో తీసుకొచ్చిన విధానం వల్ల నైపుణ్యం లేని పనులు చేయటం వలన విద్యుత్తు స్తంభాలెక్కిన కార్మికులు, ట్రాక్టర్ నడిపిన కార్మికులు అనేకమంది చనిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని తరగతుల ఉద్యోగులకు వేతనాల గుర్తించింది కానీ గ్రామ పంచాయతీ కార్మికలను విస్మరించింది. రాష్ట్రంలో మల్టీ పర్పస్ వర్కర్ విధానం పూర్తిగా రద్దు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కారం చూపాలని కోరుతూ సిద్దిపేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సఫాయి బంద్ పేరిట ఒక్కరోజు సమ్మెను నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, రూరల్ గ్రామ పంచాయతీ కార్మికులు చేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ మాట్లాడుతూ పంచాయతీ ఉద్యోగులకు మున్సిపల్ ఉద్యోగుల వలె జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని అనేక ఆందోళన పోరాటాలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను నిర్బంధిస్తూ అరెస్టులు చేశారని, తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడు నెలల కాలంలో పంచాయతీరాజ్ శాఖ మాత్యులు దనసరి అనసూయ సీతక్కని, ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్‌ని అనేకమార్లు సమస్యల పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ఇట్టిసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రానందున ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఒక్కరోజు సమ్మె సఫాయి బందు పేరుతో నిర్వహించామని తెలిజేశారు. జిల్లా కోశాధికారి రాజనర్సు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయి పడిన పెండింగ్ వేతనాలను మొత్తం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పర్మినెంట్ కనీస వేతనాలు అమలు చేయాలని జీవో నెంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్‌సీలో పంచాయతీ ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లింపులు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శి నియమించాలని అందులో పనిచేస్తున్న ఇతర సిబ్బందిని వారి అర్హతలను బట్టి పరిగణలోకి తీసుకోవాలని. రూ.10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.20 లక్షల చెల్లింపులు చేయాలని, పంచాయతీ ఉద్యోగ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శంకరయ్య, శ్రీకాంత్, మహేందర్, పంచాయితీ కార్మికులు పాల్గొన్నారు