పెండింగ్‌ జీతాలు చెల్లించాలి

– బస్తీ దవాఖానాల సిబ్బంది డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని బస్తీ దవాఖానాల సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న వందలాది బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సులతో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చేస్తున్న పనికి ఇస్తున్న జీతాలు అంతంత మాత్రమైతే… అవి కూడా సమయానికి ఇవ్వకుంటే తాము బతికేది ఎలా? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెండింగ్‌ విషయంపై ఇప్పటికే సంబంధిత మంత్రితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసినా సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును అర్థం చేసుకుని వెంటనే పెండింగ్‌ వేతనాలను ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.