పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

Pending scholarships should be released immediately: SFIనవతెలంగాణ – కంఠేశ్వర్ 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని స్థానిక ధర్నా చౌక్ వద్ద ప్లేట్ ల తో నిరసన తెలియజేసి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లడతూ.. గత ఆరేళ్ళ నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో  సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి 3000 వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకోని ఉన్నాయి. 2019- 2020 – 800 కోట్లు, 2020-2021 -2356 కోట్లు,2021-2022 – 2100.43 కోట్లు, 2022-2023 – 2958.14 కోట్లు మొత్తం 8214.57 కోట్లు రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్ధులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు వెళ్ళాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టీఫీకెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చామని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు.
తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 200 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని అన్నారు. స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు, వాటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం కోన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఆయా మార్గదర్శకాలు ప్రభుత్వమే అమలు చేయడం లేదు. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే విద్యార్ధుల నుండి దరఖాస్తులు తీసుకోని ప్రభుత్వం పరీశీలన చేయాలి. పరీశీలనలో అర్హులు అని తెలితే ముందే 25శాతం చెల్లించాలి. అకడమిక్ ఇయర్ మద్యలో 50శాతం, మిగిలిన ఫీజులు సంవత్సరం చివర్లో చెల్లించాలి.కానీ ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు. విద్యార్ధి దరఖాస్తు చేసుకోని తన కోర్సు ముగిసే వరకు కూడా ఫీజులు విడుదల చేయడం లేదు. ఫలితంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివే పరిస్థితి లేకుండా పోతుంది. రాష్ట్రంలో అత్యధికంగా బి.సి. విద్యార్థులకు ఎక్కువ ఫీజులు బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది.డబ్బులు చెల్లించలేని విద్యార్థులు సర్టీఫీకెట్స్ కళశాలలో వదిలేసి చదువులకు స్వస్తి చెప్పి ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తున్నారు అని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దీపిక, జిల్లా నాయకులు విశాల్, సతీష్, రాజు, అజాద్, తదితర నాయకులు పాల్గొన్నారు.