– సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
– సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె చేపట్టారు. గురువారం సీఐటీయూ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో విఫలమైందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు నెలల నుండి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడం లేదన్నారు. కార్మికులు జీవనం కొనసాగించాలంటే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.150 కోట్లు విడుదల చేసింది కానీ కార్మికులకు ఇప్పటి వరకు వారి అకౌంట్లో నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మె చేస్తున్న సందర్భంలో అనేక హామీలు ఇచ్చారని వారి మాటలు విని గ్రామపంచాయతీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం చేస్తుందని ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలన్నారు. జీఓ నెంబర్ 51ని సవరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సోనేరావు, వెంకట్‌రావు, ఇంద్రాజ్, ఆడేళ్లు, అశోక్, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు రఫీ, దశరథ్, సుందర్, అశోక్, రమేష్, చిన్ను, రాంషో, బాధిరావు, గోవింద్, రాధ పాల్గొన్నారు.