– లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం
– ఇచ్చేదాకా నల్లబ్యాడ్జీలతో పంచాయతీ కార్మికుల విధులు
– రూ.9,500 వేతనం కూడా ఇవ్వలేని స్థితిలో సర్కారుందా?
– సీఎం, ఆర్థిక మంత్రి సమస్యలు పరిష్కరించాలి
– మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి : పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడిలో పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ పెట్టి వేతన సమస్య పరిష్కరిస్తున్నట్టు ప్రకటించాలని కోరారు. వేతనాలివ్వకుంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీ తర్వాత చెప్పాపెట్టకుండా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెండింగ్ వేతనాలను ఇచ్చేదాకా గ్రామాల్లో జీపీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనాలనీ, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పంచాయతీ కార్యాలయాల ముందు నినాదాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్మికులకు వారి ఖాతాల్లోనే వేతనాలు వేయాలని సూచించారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేయాలనీ, కార్మికులకు ఇన్సూరెన్స్, బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గత సర్కారు మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించకూడదనీ, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడిని కోరారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌ను వందలాది మంది జీపీ కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావుకు యూనియన్ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. వేతన సమస్య తీవ్రతను నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కార్మికుల బృందానికి డిప్యూటీ కమిషనర్ హామీనిచ్చారు.
ముట్టడినుద్దేశించి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ ఉందని ధర్నాలు చేయొద్దంటారా? ఏడు నెలల నుంచి వేతనాలు ఇవ్వాలని తెలియదా? ఎట్ల బతుకుతారనే సోయి లేదా? నెలనెలా ఇచ్చే జీతానికి కోడ్‌తో సంబంధమేంటి? మేం ఏమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? అంటూ రాష్ట్ర సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 నుంచి కేసీఆర్ వ్యవహరించిన తీరు వల్లనే పంచాయతీ కార్మికులంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓట్లేశారని తెలిపారు. ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మీరు కూడా గత ప్రభుత్వం మాదిరిగా వుంటారా? కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారా? అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు జీతాల్లేక పూట గడవటం కోసం ఇబ్బందులు పడుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. జీతాలు చెల్లించకుంటే పంచాయతీ కార్మికులు పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించబోరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఉత్పన్నమవుతున్న చెక్‌పవర్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక, మతతత్వ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ అధికారంలోకొచ్చిన ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో సవరణలు చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు చేసిందని విమర్శించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్‌ను పూర్తిగా తగ్గిస్తూ రాష్ట్రాలపై వదిలివేసిన తీరును వివరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ.. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వమిచ్చిన రూ.5 లక్షల ఇన్సూరెన్స్, దహనసంస్కారాలకు రూ.10 వేల హామీని నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు మాట్లాడుతూ..రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుల్లో కార్మికులు పట్టుదలగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముట్టడిలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పైళ్ల గణపతిరెడ్డి, ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, కార్యదర్శులు వెంకటేష్ గౌడ్, బి. వెంకటేష్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నారోజు రామ్‌చందర్, మండ్ల రాజు, కొప్పుల శంకర్, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.