పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి..

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి..– పొగగొట్టం ఎక్కి కార్మికుని ఆందోళన
– ‘ట్రైడెంట్‌’ యజమాన్యంతో చర్చలు జరిపిన కలెక్టర్‌, లేబర్‌ అధికారులు
– సమస్యను పరిష్కరిస్తామన్న హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-జహీరాబాద్‌
పెండింగ్‌ వేతనాలు చెల్లించాంటూ ట్రైడెంట్‌ పరిశ్రమలో మరోమారు నిరసనలు చెలరేగాయి. వేతనాల విషయంలో పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని, తమ కుటుంబ పోషణ దినదిన గండంగా మారుతున్నదని ఇదివరకే పలుమార్లు కార్మికులు ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా.. రవి అనే ఓ కార్మికుడు బుధవారం పరిశ్రమలోని బాయిలర్‌ పొగగొట్టం పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేపట్టాడు. దాంతో అధికార యంత్రాంగం దిగొచ్చి జిల్లా కలెక్టర్‌.. పరిశ్రమ యజమాన్యంతో ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. వచ్చే సోమవారం కల్లా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దాంతో ఆందోళన విరమించారు.
రేపు కూతురి వివాహం.. అందుకే కార్మికుని ఆందోళన
పొగగొట్టం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయిన కార్మికుడు రవి.. కూతురు వివాహం ఈనెల 17న జరగనున్నది. ఈ నేపథ్యంలో డబ్బులకు ఇబ్బందులు ఎదురవడంతో.. ఆందోళనతో అతను పొగగొట్టం ఎక్కి నిరనస తెలిపాడు. అంతేకాకుండా మరో కార్మికుని కూతురు వివాహం కూడా ఈనెల 21వ తేదీన ఉన్నది. దాంతో వారూ ఆందోళన బాట పట్టారు.అయితే వారిద్దరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెల్లించేందుకు యజమాన్యాన్ని ఒప్పించినట్టు ఫిలిం డెవలప్‌మెంట్‌ సంస్థ చైర్మెన్‌ గిరిధర్‌ రెడ్డి, కార్మిక నాయకులు రాములు యాదవులు తెలిపారు.ఈ సందర్భంగా కార్మికులు రాములు, రవి నర్సింలు మాట్లాడుతూ.. 2023 నుంచి కార్మికులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలను యాజమాన్యం చెల్లించకపోవడంతో తమ పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. యజమాన్యం మాటలు విని ప్రతిరోజూ క్రమం తప్పకుండా పరిశ్రమకు వచ్చి వెళుతున్నామని, అయినా జీతాలు మాత్రం ఇవ్వట్లేదని తెలిపారు. దాంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నదన్నారు. ఈ పరిశ్రమపై కార్మికులతో పాటు సుమారు 4000 మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారందరి జీవితాలతో ఆడుకోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమలో క్రషింగ్‌ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అక్కడికి వచ్చిన నాయకులు, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ యన్‌.గిరిధర్‌రెడ్డి కార్మికుడికి నచ్చజెప్పి.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో మాట్లాడి ఇద్దరు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు.మరోపక్క పరిశ్రమకు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో రావడంతో.. వారిని అదుపు చేసేందుకు ఏసీఎల్‌ డీసీఎల్‌ అధికారులతో పాటు సీఐ, ఎస్‌ఐ, వివిధ పార్టీల నాయకులు చేరుకొని వారికి నచ్చజెప్పారు. పరిశ్రమకు వచ్చిన వారిలో.. కార్మికులతో పాటు జహీరాబాద్‌ మండలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌లు జగదీశ్వర్‌, కరణ్‌, ఎంపీటీసీలు, కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.