దేశ చరిత్రలో ‘పెండ్యాల’ రికార్డ్‌ మూడుచోట్ల ఒకేసారి గెలుపు

దేశ చరిత్రలో 'పెండ్యాల' రికార్డ్‌ మూడుచోట్ల ఒకేసారి గెలుపు– జైలు నుండే నామినేషన్‌
– ప్రచారం లేకుండానే విజయం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
భారతదేశ ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నమోదైంది. దేశంలో తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో వరంగల్‌ పార్లమెంటు, హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు ఒకేసారి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి పెండ్యాల రాఘవరావు.
అదీ జైలులో వుండి నామినేషన్‌ వేసి ఎలాంటి ప్రచారమూ చేయకుండానే ఈ మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించి ఆల్‌టైం రికార్డు సృష్టించారు. నేటి వరకు ఈ రికార్డును బద్దలు కొట్టిన నాయకులు లేకపోవడం గమనార్హం.
వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గంలోపాటు, హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి విజయం సాధించారు. అయితే, వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాలని భావించిన ‘పెండ్యాల’ హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేశారు. తొలి వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా ఆయన పార్లమెంటులో విశిష్ట సేవలందించారు. ఆ తర్వాత జరిగిన ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ పీడీఎఫ్‌ అభ్యర్థులే విజయం సాధించారు.
తొలి ఎన్నికల్లో ‘కాళోజీ’పై విజయం
1952లో తొలిసారి వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పెండ్యాల రాఘవరావు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రజాకవి కాళోజీ నారాయణరావుపై 3613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పెండ్యాలకు 77 వేల 264 (41.4 శాతం) ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి కాళోజీ నారాయణరావుకు 73 వేల 651 (39.5) ఓట్లు వచ్చాయి. సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.సోమయాజులకు 35 వేల 591 (19.1) ఓట్లు వచ్చాయి.
హన్మకొండ, వర్ధన్నపేటలోనూ ‘పెండ్యాల’ విక్టరీ..
హన్మకొండ నియోజకవర్గంలో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేసిన పెండ్యాల రాఘవరావు తన సమీప ప్రత్యర్థి బికె రెడ్డిపై 6,728 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెండ్యాలకు 17 వేల 281 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి బికె రెడ్డికి 10 వేల 553 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి సి.రావుపై పెండ్యాల 2 వేల 803 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ పెండ్యాలకు 9,446 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రావుకు 6 వేల 643 ఓట్లు వచ్చాయి.
ఆర్యసమాజం నుంచి పార్లమెంటు వరకు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో రాఘవరావు 1917 మార్చి 15వ తేదీన జన్మించారు. హన్మకొండలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1930లో స్వాతంత్య్ర పోరాట ప్రభావంతో ‘పెండ్యాల’ తొలుత ఆర్యసమాజంలో చేరారు. అనంతరం ఆంధ్ర మహాసభలో పని చేశారు.
ఆంధ్ర మహాసభలో చీలిక రావడంతో ‘పెండ్యాల’ భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సైనిక చర్య నేపథ్యంలో మల్కాపురం ప్రాంతంలో పెండ్యాల రాఘవరావును పోలీసులు అరెస్టు చేసి జైలు శిక్షతోపాటు రూ.300 జరిమానా విధించారు. ఈ క్రమంలోనే 1952లో జనరల్‌ ఎన్నికలు జరగడంతో పోటీ చేసి గెలిచారు. పార్లమెంటులో పలు అంశాలపై అనర్గళంగా ప్రసంగించారు. సంస్థానాల విలీనం తరువాత జమీందార్లు, జాగీర్దార్లుకు పారితోషికాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు.