పెంకుటిల్లు

పెంకుటిల్లుఉండే ఉంటానెక్కడో – ఇరుకు సీసాలాంటి ఈ లోకంలోకి రాకముందు
పురాజన్మ అనే నకలు పేరుతో తిరిగినప్పుడు
నాజూకు కళ్ళతో లోకాన్ని కాంతివంతం చేసి ఉంటాను
ఎన్నో వెలుగు తీరాలు ఈది వచ్చిన ప్రాణం కదా –
సువర్లోకాల పొలిమేరల్లో అదంతా మర్చిపోయాక
దారిచ్చిన గాలి హోరులో ఏ మాటా వినబడనప్పుడు
ఏ చేసుకున్న పుణ్యాలో ఇంటినిచ్చి నిద్రపుచ్చి ఉంటాయి
అందుకే నేను పుట్టిన పెంకుటిల్లు మీద మోజు పోదని
లోకంలో అది నా మొదటి మజిలీ అని మెదడెప్పుడో స్థిరపడిపోయింది
మళ్ళీ ఇన్నేళ్ళకు దాన్ని వెతుకుతూ వెళ్ళినప్పుడు
అది కట్టిన తాత ఆత్మ గాలి జీరలా తల వెనకే తిరిగింది
చిన్నప్పుడు గోలీలాడిన మట్టిని కొంచెం పొట్లం కట్టి తెచ్చినప్పుడు
ఈ పిచ్చి ఇంకా తగ్గనందుకు ఇల్లంతా భళ్ళుమంది
వాళ్ళ పోకడతో పనేముంది కానీ
పెంకుటింటికెళ్ళి వచ్చాక ప్రాణం
నదీతీరాల్లో చేసిన దానంలా నెమ్మదించింది
శ్రుతుల్లోనే కాదు స్మతుల్లోనూ బతకొచ్చని తేలిపోయింది
– రఘు, 9676144904