– మోడీ ప్రభుత్వ నిర్వాకం ఆయుష్మాన్ భారత్‌లోనూ అవకతవకలు నిగ్గు తేల్చిన కాగ్
వృద్ధాప్య పింఛన్ల కోసం కేటాయించిన నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. పోనీ ఆ నిధులను వేరే ఇతర ప్రజోపయోగ పథకాలకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఈ సొమ్మును ఖర్చు చేస్తున్నారట. ఇదేదో ప్రతిపక్షాలో, గిట్టని వారో చేసిన ఆరోపణ కాదు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరుపై లోక్‌సభకు సమర్పించిన ఆడిట్ నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఈ విషయాన్ని వేలెత్తి చూపింది. వృద్ధాప్య పెన్షన్లు సహా జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల (ఎన్‌ఎస్‌ఏపీ) కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రచార ఆర్భాటాలకు వెచ్చిస్తోందని కాగ్ తన నివేదికలో తెలియజేసింది.
న్యూఢిల్లీ : ‘వివిధ ఎన్‌ఎస్‌ఏపీ ఉప పథకాల కింద పెన్షన్ చెల్లింపుల కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కేటాయింపులను ఉద్దేశించారు. అయితే ఈ నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దారి మళ్లించినట్లు మా ఆడిట్‌లో తేలింది’ అని కాగ్ వివరించింది. గ్రామీణాభివృద్ధి శాఖ తన కార్యక్రమాలు, పథకాలకు ప్రచారం కల్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2017 జూన్‌లో రూ.39.15 లక్షలు, అదే సంవత్సరం ఆగస్ట్‌లో రూ.2.44 కోట్లు మంజూరు చేసింది. గ్రామ సమృద్ధి, స్వచ్ఛ భారత్ సహా పలు పథకాల ప్రచారానికి ఈ నిధులను వెచ్చించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఖర్చు చేసిందేమో ఎన్‌ఎస్‌ఏపీ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు. కానీ ప్రచారం కల్పించిన పథకాల జాబితాలో ఆ కార్యక్రమాల ఊసే లేదు. మరోవైపు ఎన్‌ఎస్‌ఏపీ కింద సమాచారం, విద్య, కమ్యూనికేషన్ కార్యకలాపాల కోసం కేటాయించిన రూ.2.83 కోట్లను మంత్రిత్వ శాఖలోని ఇతర పథకాలకు మళ్లించడంతో ఆయా కార్యకలాపాలపై లబ్దిదారులకు అవగాహన కల్పించలేకపోయారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, జమ్మూకాశ్మీర్, బీహార్, గోవా రాష్ట్రాలకు అదనంగా రూ.57.45 కోట్లను మళ్లించారని కూడా కాగ్ తెలిపింది. ఉదాహరణకు ఐజీఎన్‌ఓఏపీఈఎస్ కింద రూ.42.93 కోట్ల కేంద్ర, రాష్ట్రాల వాటాను 2018-19లో ఐజీఎన్‌డీపీఎస్ కింద పింఛన్ల చెల్లింపుల కోసం బీహార్‌కు మళ్లించారు. అదే విధంగా రాజస్థాన్‌లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 12,347 లబ్దిదారులకు సంబంధించిన నిధులను దారిద్య్రరేఖకు దిగువనున్న వారు, ఆస్థా కార్డుదారుల ఎల్‌ఐసీ బీమా ప్రీమియంల చెల్లింపుల కోసం వినియోగించారు.
ఆయుష్మాన్ భారత్‌లో…
తమిళనాడులో ఆయుష్మాన్ భారత్-పీఎం జన్ ఆరోగ్య యోజన (ఎబీ-పీఎంజేఏవై) పథకం కింద నమోదైన 1,285 మంది లబ్దిదారులను ‘000000000000’ ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేశారన్న విషయం మీకు తెలుసా? పోనీ ఈ పథకంలో చేర్చిన 43,187 కుటుంబాలలో సభ్యుల సంఖ్య 11 నుండి 200 వరకూ ఉన్న విషయమైనా తెలుసా? పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ ఈ కుటుంబాల సమాచారాన్ని విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. ‘కుటుంబంలో ఇలా అవాస్తవ సంఖ్యలో సభ్యులు ఉండడాన్ని గమనిస్తే లబ్దిదారుల నమోదు ప్రక్రియలో సరైన పద్ధతులు పాటించలేదని అర్థమవుతుంది. అదీకాక మార్గదర్శకాలలో కుటుంబానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోవడాన్ని కూడా లబ్దిదారులు అవకాశంగా తీసుకున్నారు’ అని కాగ్ తెలిపింది. మరీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన రోగి, అదే సమయంలో వేర్వేరు ఆస్పత్రులలో చేరాడు. ఇది ఎలా సాధ్యం? పైగా ఓ ఆస్పత్రిలో పడకల సంఖ్య కంటే చేరిన రోగుల సంఖ్యే ఎక్కువగా నమోదైంది. లబ్దిదారుల నమోదులో పొరబాటు జరిగిన మాట నిజమేనని జాతీయ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. సమాచారంలో వ్యత్యాసాలను ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దృష్టికి తెచ్చామని తెలిపింది. అయితే ప్రజారోగ్యం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి అంతిమ నిర్ణయం తీసుకునేది వారేనని స్పష్టం చేసింది. లబ్దిదారుల ఎంపిక కోసం రాష్ట్రాలు తమ సొంత ఐటీ వేదికలను ఉపయోగించుకుంటాయని చెప్పింది. ఇదిలావుంటే ఏడున్నర లక్షల మంది లబ్దిదారులను ఒకే ఫోన్ నెంబర్ ‘9999999999’తో అనుసంధానం చేశారు. పైగా దానిలో పది అంకెలు ఉన్నాయి. దీనికి ఆరోగ్య సంస్థ వివరణ ఇస్తూ పథకం ప్రారంభంలో లబ్దిదారులను గుర్తించే సమయంలో మొబైల్ నెంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలేదని, దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపే వారు పది అంకెల నెంబరును నమోదు చేశారని తెలిపింది.