– దొంతి యూనియన్ బ్యాంకు
– ముందు పింఛన్‌దారుల ఆందోళన
– మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన
నవతెలంగాణ-శివ్వంపేట
ఆధారం లేని వృద్ధులకు ఆసరాగా ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న ఆసరా పింఛన్ డబ్బులు రుణ ఖాతాలోకి జమ చేసుకోవడమేంటని పింఛన్ దారులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన దొంతి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతిలో ఉన్న యూనియన్ బ్యాంకులో గుండ్లపల్లి రైతులకు క్రాప్ లోన్లు ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. ఈ సమయంలో లబ్దిదారుల ఖాతాల్లో పడుతున్న ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ డబ్బులను బ్యాంకు వాళ్లు క్రాప్‌లోన్ కింద జమ చేసుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దొంతిలోని యూనియన్ బ్యాంకు ఎదుట బాధిత 126 మంది రైతులు, పింఛన్ దారులు ఆందోళన చేపట్టి, బ్యాంకు అధికారులను నిలదీశారు.
పింఛన్ డబ్బులు మీరు జమ చేసుకుంటే మేమెట్లా బతకాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మాజీ సర్పంచులు గొర్రె వెంకట్ రెడ్డి, తాటి కిష్టయ్య, పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు వంచ సత్యనారాయణ రెడ్డి, మల్లారెడ్డి, ఉప్పునూతల సత్యనారాయణ గౌడ్, బోల్ల సదానందం, ఎల్కంటి వినోద్ కుమార్ సంఘీభావం తెలిపి పింఛన్ డబ్బులు తిరిగి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సిములు యాదవ్, కృష్ణ, శ్రీనివాస్, రవి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.