ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన

Pensioners protest in front of Adilabad Collectorateనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శశికాంత్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శశికాంత్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఎలాంటి చర్యలు లేవని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన బాట చేపట్టామన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, ఏపీ తరహాలో ఆర్టీసీలో 25 శాతం పెన్షనర్లకు రాయితీ ప్రకటించాలని, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఈ కుబేర్ లో పెండింగ్ బిల్లులను క్లీయర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, గౌరవ అధ్యక్షుడు దయకర్రెడ్డి, కోశాధికారి బాపురావ్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.