సినీ పాటల పయోనిథి

Peonythi of movie songsనిజాం నిరంకుశ పాలనను ఎదిరించి, తెలంగాణ నిగళాలు తెగతెంచి, ఉద్యమ కవితావేశంతో ఉప్పెనలా విజృంభించి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ మాతృభూమిని కీర్తించి, నవరసాలూరే సినిమా పాటలతో తెలుగు ప్రజలను అలరించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య.
ముందు కవిత్వం రాసి ఆ తర్వాతే సినీగీతాలు రాసిన కవి దాశరథి. 1961లో ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో విడుదలైన ‘వాగ్దానం’ సినిమా కోసం ‘నా కంటిపాపలో నిలిచిపోరా’ అనే పాటను మొదటగా రాశాడు. ఆ తరువాత నటసమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు పిలుపునందుకుని ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ అనే పాటను రాశాడు. మొదటిపాట వాగ్దానంలో రాసినా ఇద్దరుమిత్రులు సినిమాలోని పాట ముందుగా విడుదలైంది. అశేష ప్రజల హృదయాల్లో ఖుషీ థిల్లానా మోగించింది.
ప్రణయం, ప్రబోధం, భక్తి, విషాదం, వినోదం, జానపదం, నిషా, ఖవ్వాలీ, వీణ వంటి అన్ని రకాల పాటలు రాసి మెప్పించిన కవి దాశరథి. ఆయన రాసిన సినిమా పాటల మాధుర్యాన్ని గూర్చి ఈ వ్యాసంలో చర్చించుకుందాం.
‘వాగ్దానం'(1961) సినిమాలో.. ”నా కంటిపాపలో నిలిచిపోరా – నీ వెంట లోకాల గెలువనీరా” అనే పల్లవితో సాగిన పాటలో..
”ఆ చందమామలో ఆనందసీమలో/ వెన్నెల స్నానాలు చేయుదామా/ మేఘాలలో వలపురాగాలలో/ దూరదూరాల స్వర్గాల చేరుదమా” అనే చరణంలో సమతాభివ్యక్తి నిండా పొదిగిన తీరు కనిపిస్తుంది. చందమామ సన్నిధిలో వెన్నెల స్నానాలు చేయడం, మేఘాల మాటున ఉన్న స్వర్గాలను చేరుకోవాలనే ప్రేయసీప్రియుల ఆరాటాన్ని ఎంతో రమణీయంగా ఊహించాడీ పాటలో దాశరథి.
‘ఇద్దరుమిత్రులు’ (1961) సినిమాలో.. ”ఖుషీఖుషీగా నవ్వుతూ/ చలాకిమాటలు రువ్వుతూ/ హుషారుగొలిపేవెందుకే/ నిషా కనులదానా” పాటంతా జగణంలో సాగుతుంది. ఇందులో ఖుషీఖుషీ, చలాకి, హుషారు, నిషా, హమేషా, మజా వంటి ఉర్దూపదాలు కొత్తదనంతో, గుబాళింపుతో ధ్వనిస్తాయి. ప్రేయసీప్రియుల ప్రణయ సన్నివేశాన్ని ఎంతో మధురంగా ఈ పాటలో తెలియజేశాడు.
అలాగే.. ‘పూజ’ (1975) సినిమాలో రాసిన.. ”ఎన్నెన్నో జన్మలబంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ” అనే పాటలో.. ”పున్నమి వెన్నెలలోన పొంగును కడలి/ నిన్నే చూసిన వేళ నిండును చెలిమి/ నువు కడలివైతే నే నదిగ మారి/ చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా” అంటాడు.
పున్నమి వెన్నెలలోనే సముద్రం పొంగుతుందన్న కవి సమయాన్ని దాశరథి ఇక్కడ పాటించాడు. కథానాయకుడు సముద్రమైతే నాయిక నదిగా మారి అతనిలో కలిసిపోవడమనేది ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమను తెలుపుతుంది.
‘కన్నెవయసు’ (1973) సినిమాలో.. ”ఏ దివిలో విరిసిన పారిజాతమో/ ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో/ నా మదిలో నీవై నిండిపోయెనే” అనే పాట దాశరథికి సినీకవిగా ఎంతో గుర్తింపునిచ్చింది. ఆ పాట పాడిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకి గాయకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చిందా పాట. ఈ పాటలో వాడిన దివ్యదీపం, నవ్యతారలు, వెన్నెలకాంతి మొదలగు పదబంధాలు ఆయనలోని కవితాపటిమను చాటుతున్నాయి. ఇవేకాక.. ‘తోటరాముడు’ (1975) సినిమాలోని ”ఓ బంగరు రంగుల చిలకా పలుకవే”, ‘నోము'(1972) సినిమాలోని ”మనసే జతగా పాడిందిలే”, ‘మంచిమనసులు'(1962) లోని ”నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే” మొదలైన ప్రేమగీతాలు అజరామరాలు.
భక్తిగీతాలు రాయడంలో దాశరథిది ప్రత్యేకమైన ముద్ర.
‘రంగులరాట్నం'(1967) సినిమాలో.. ”నడిరేయి ఏ జామునో/ స్వామి నినుజేర దిగివచ్చునో/ తిరుమల శిఖరాలు దిగివచ్చునో” అనే పాట దాశరథి భక్తిగీతాల్లో విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ”ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి” అంటూ రామదాసు చెప్పిన తీరులోనే ”మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ” అంటూ అలివేలుమంగ ద్వారా వేంకటేశ్వరునికి తన బాధను వినిపించాడు.
ఇంకా.. ‘మేనకోడలు’ (1972) సినిమాలో.. ”తిరుమల మందిర సుందరా/ సుమధుర కరుణాసాగరా/ ఏ పేరున నిను పిలిచేనురా/ ఏ రూపముగా కొలిచేనురా”… అంటూ వేంకటేశ్వరుని నామమాధుర్యాన్ని, రూప సౌందర్యాన్ని అభివర్ణించాడు. అతని ఏ పేరుతో పిలవగలనని, ఏ రూపంగా కొలవలేనని అనంత విశ్వమంతా నిండి ఉన్న స్వామిని కీర్తిస్తాడు. కరుణకు సముద్రం వంటివాడని కొనియాడుతాడు.
‘రాము’ (1968) సినిమాలో రాసిన ”రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా.. దీనులను కాపాడ రారా కృష్ణయ్యా” వంటి భక్తిగీతాలు కూడా సుప్రసిద్ధాలు.
తెలంగాణ ఉద్యమకాలంలో ఉత్తేజితమైన అభ్యుదయ గీతాలు రాసిన దాశరథి సినీరంగంలో కూడా అంగారంతో కూడా వేడి వాడి గీతాలను వెదజల్లాడు.
‘పదండి ముందుకు’ (1962) సినిమాలో.. ”మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో/ బరువులూ బాధలూ అందరితో పంచుకో” అంటూ బంధనాలు తెంచుకొని ప్రగతిపథంపై నడవమని బోధించాడు. బరువులను, బాధలను అందరితో పంచుకుంటూ బతుకుబాధను దించుకొమ్మనే సందేశాన్ని ఈ పాట ద్వారా అందించాడు.
‘మనసు మాంగల్యం’ (1971) సినిమాలో.. ”ఆవేశం రావాలి ఆవేదన కావాలి/ గుండెలోని గాయాలు మండించే గేయాలు/ వేదనలే శోధనలై రగలాలి విప్లవాలు” తన అగ్నిధారతో కూడిన కవితావేశాన్ని ప్రదర్శిస్తాడు ఈ పాటలో. ఆవేశం, ఆవేదనయే మనిషి భవితను వెలిగిస్తాయని, ముందుకు నడిపిస్తాయని, గుండెలోని గాయాలు గేయాలై రగిలి విప్లవాలై దూకాలంటాడు. వేదనతో, వేడిమితో ఉన్నదే అసలైన జీవితమని, బాధ లేని జీవితం రుచింపదని చెబుతాడు.
దాశరథి రాసిన ప్రబోధగీతాలు కూడా మనల్ని ఆలోచింపజేస్తాయి. ముందుకు నడిపిస్తాయి.
‘గంగ-మంగ’ (1973) సినిమాలో..
”జీవితమెంతో చిన్నదిరా/ ప్రతి నిమిషం విలువైనదిరా/ నిన్నా రేపని తన్నుకోకురా/ ఉన్నది నేడే మరువబోకురా” అంటూ జీవితం చాలా చిన్నదని, ఉన్న సమయాన్ని వధా చేసుకోకూడదని సందేశించాడు. పనిచేయడానికి ఈరోజని, రేపని వాయిదాలు వేసుకోకూడదు. అనుకున్నామంటే వెంటనే చేసేయాలి. అదే నిజమైన, చురుకైన మనిషి చేయాల్సిన పని. ఉత్తమజాతికి చెందిన మనిషికి ఉండవలసిన లక్షణమిదేనని చెప్పాడు.
‘రాము’ (1968) సినిమాలో ..
”తీగెలు తెగిన వీణియపై/ తీయని రాగం పలికేనా?/ ఇసుకు ఎడారిని ఎపుడైనా/ చిన్ని గులాబి విరిసేనా?” అంటూ నిరాశామయ హృదయాన్ని, ఆ హృదయంలోని బాధని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు.
నిషా గీతాలు రాయడంలో దాశరథి తనదైన స్థానాన్ని చాటుకున్నాడు.
‘మనుషులు మమతలు'(1965) సినిమాలో.. ”నేను తాగలేదు నాకు నిషాలేదు/ నాకు నిషారాదు/ కొందరికి డబ్బు నిషా కొందరికి క్లబ్బు నిషా/ లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిషా” అంటూ.. మత్తులో తూలుతూనే వేదాంతధోరణిలో ప్రపంచమంతా స్వార్థంతో ఊగిపోతుందనే సందేశాత్మకంగా చెప్పాడు. ఇంకా.. కైపెక్కించే కమ్మనిరేయి, నిషాలేని నాడు హుషారేమి లేదు మొదలైన నిషా గీతాలు కూడా అద్భుతమే.
దాశరథి వీణపాటల స్పెషలిస్ట్‌. ఆయన రాసిన వీణపాటలకు ప్రత్యేకమైన స్థానముంది.
‘ఆత్మీయులు’ (1969) సినిమాలో రాసిన.. ”మదిలో వీణలు మ్రోగే/ ఆశలెన్నో చెలరేగే/ కలనైన కనని ఆనందం/ ఇలలోన విరిసే ఈనాడే” అంటూ నాయిక ఎదలో ఉప్పొంగే ఆనందాన్ని, చెలరేగే ఆశలను సరళమైన పదాలతో వ్యక్తీకరించాడు. సిగ్గుతెరల మధ్యన మొగ్గ తొడిగిన ప్రేయసి వలపు గురించి సుతిమెత్తగా వివరిస్తాడు ఈ వీణపాటలో.
‘అమాయకురాలు’ (1971) సినిమాలో రాసిన.. ”పాడెద నీ నామమె గోపాలా/ హదయములోన పదిలముగానే/ నిలిపెద నీ రూపమే” అనే పాటలో శ్రీ కష్ణుని నామగానాన్ని వీణ ద్వారా వినిపిస్తాడు.
‘మూగమనసులు'(1964) లో.. ”గోదారి గట్టుంది/ గట్టుమీన సెట్టుంది/ సెట్టుకొమ్మన పిట్టుంది/ పిట్ట మనసులో ఏముంది” అంటూ గోదారి గట్టుపైన ఉరకలేసే అమ్మాయి సొగసుదనాన్ని, గడుసుదనాన్ని పిట్టకు అన్వయించి చెప్పి తన కలం బలం చాటాడు. చరణంలో.. ”ఒగరు ఒగరుగా పొగరుంది/ పొగరుకు దగ్గ బిగువుంది/ తీయతీయగా సొగసుంది/ సొగసుని మించే మంచుంది” అంటూ ఒగరుదనం మించిన పొగరుదనాన్ని, సొగసు తీయదనాన్ని మించిన మంచిదనాన్ని పల్లెటూరిపిల్లలో చూపించిన కలం దాశరథిది.
”దీపాలు వెలిగే పరదాలు తొలిగే/ ప్రియురాలు పిలిచే రావోయి” (పునర్జన్మ), ”నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి” (ఇద్దరుమిత్రులు) వంటి ఖవ్వాలీ పాటలతో అలరించి మురిపించిన దాశరథి దాదాపు 2500కు పైగా సినిమాపాటలు రాసి వెండితెరను వెలిగించాడు. ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘శభాష్‌ పాపన్న’ మొదలైన సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాడు కూడా.
సినిమా నాడి తెలిసిన కలం కనుకనే ”ఎత్తుకుంటావా? నన్నెత్త మంటావా?, సూదిలో దారం సందులో బేరం సరిజోడు సిన్నోడు మిరియాలకారం” వంటి ద్వంద్వర్థాలతో పాటలు రాసి కూడా భళా అనిపించుకున్నాడు. పాటల పయోనిథిగా, సినీగీతాలవారధిగా తెలుగు సినీరంగంలో తన శకాన్ని సృష్టించాడు.
(జూలై 22 న దాశరథి శతజయంతి సందర్భంగా..)

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీగేయరచయిత, 6309873682