ఫార్మా సిటీ రద్దుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు

– కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, బెల్లయ్య నాయక్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ముచ్చర్ల ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నేతలు కోదండరెడ్డి, బెల్లయ్యనాయక్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహరెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. సీఎం నిర్ణయం పట్ల ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాలకు చెందిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తుందని చెప్పారు. 2017 అక్టోబరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముచ్చర్ల ఫార్మా సిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరించాయని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో 19, 330 భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేేకించారని తెలిపారు. ప్రభుత్వం వేల మంది పోలీసులు పెట్టి వారిని అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.