బీఆర్‌ఎస్‌ను ఓడించినందుకు జనం బాధపడుతున్నారు

– ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు
– చివరి వరకు తెలంగాణ కోసం పోరాడుతా : కార్యకర్తలతో గులాబీ బాస్‌ కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ను ఓడించినందుకు జనం బాధపడుతున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలనుంచి తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన వారితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించిందని అన్నారు. విద్యుత్‌, సాగునీరు, తాగునీరు వ్యవసాయం తదితర రంగాల్లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందన్నారు. ఓటమితో కుంగిపోకుండా కొత్త ఉత్సాహంతో విజయం వైపు పయనించాలని కార్యకర్తలకు సూచించారు. ”ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు. ప్రజా తీర్పే శిరోధార్యం. వారు ఎలాంటి పాత్రను అప్పగించినా దాన్ని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం నిజమైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. ప్రజలతో మమేకమై, సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలి” అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ కొనసాగించక పోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని అవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేననీ, రాష్ట్రం సంపూర్ణ అభివద్ధి సాధించడమే తమ అంతిమలక్ష్యమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అషన్నగారి జీవన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిది
తెలంగాణ సాధనలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో తనను కలిసిన ప్రముఖ కవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో ఉద్యమం నాటి ముచ్చట్లను పంచుకున్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ సమాజాన్ని సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను సరిదిద్దుకుంటూ తెలంగాణను దేశానికే తలమానికంగా తయారు చేశామని పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు రచయితలు ముందుండాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న రాసిన ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్‌కు అందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.