– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలని మరోసారి రుజువైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో సీపీఐ(ఎం) ఖమ్మం రూరల్ మండలం కమిటీ సమావేశం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు పి.మోహన్ రావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నున్నా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికై నియంతల్లా, రాజ్యాధిపతుల్లా పాలిస్తే ఎన్నికల్లో ప్రజలు తగు రీతిలో గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్, కేంద్రంలో నరేంద్ర మోదీ తమను తాము చక్రవర్తుల్లా, నియంతలుగా భావిస్తూ అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలించబట్టే ప్రజలు ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పారన్నారు. కేంద్రంలో మోడీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అధికారంలోకి వచ్చాడని, తెలుగు రాష్ట్రాల వల్లనే మరోసారి మోదీ అధికారం చేపడుతున్నారని వివరించారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న పాలకులు ప్రజలకు సేవలు చేయాలి కానీ, ప్రజల గొంతు నొక్కడం, ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని చూడడం చేస్తే ప్రజలు తిరగబడతారని అది ఎన్నోసార్లు ఆచరణలో రుజువైందని తెలిపారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాకు, ధర్నా చౌక్ లు ఎత్తేసిన కేసిఆర్ కు, ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను హింసించిన జగన్ కు, రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన మోడీకి ప్రజలు తగురీతిలో గుణపాఠం చెప్పారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకులైన ప్రజలను ఆదరించాలని, ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై తప్పుడు కేసులు పెట్టకుండా పాలన సాగించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మోడీ సంస్కారవంతుడైతే ప్రధాని పదవిని చేపట్టకుండా ఇంకొకరికి కట్టబెట్టాలని తెలిపారు. బీజేపీ ఒంటరిగా అధికారంలో రాకపోవడంతో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని జనరంజక రీతిలో పాలన అందించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే ఎర్రజెండాలపై అబద్ధాలు, దుష్ప్రచారాలు, ఎన్ని కుట్రలు పన్నిన ప్రజల నుంచి ఎర్రజెండాను దూరం చేయలేరన్నారు. రాబోయే రోజుల్లో ఎర్రజెండాకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జీ బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల ఇన్‌చార్జీ ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, రంజాన్ పాషా, మండల కమిటీ సభ్యులు ధనియాకుల రామయ్య, తాటి వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటరమణ, కారుమంచి గురవయ్య, వడ్లమూడి నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, చిలువేరు బాబు, ఏటుకూరి ప్రసాదరావు, నంబూరి మంగ తదితరులు పాల్గొన్నారు.