– కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా మైసిగండిలో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మోసపూరిత హామీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. నాన్న పులి వచ్చే అన్న కథలాగ ప్రతిసారీ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలు ఉచిత హామీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. ఖపూటకో పథకంతో పది సంవత్సరాలుగా మభ్యపెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరు కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలి ఆయన చెప్పుకొచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు కిషన్ నాయక్, వినోద్, తులసి రామ్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.