ప్రజలు మూఢనమ్మకాలు నమ్మవద్దు

– ఎస్‌ఐ యు.భాస్కర్‌ రెడ్డి
నవతెలంగాణ-చేర్యాల
మూఢనమ్మకాలు నమ్మవద్దని, సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ యు. భాస్కర్‌ రెడ్డి అన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిట్యాల గ్రామంలో పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పోలీస్‌ కళాబందంచే కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాని యెడల పోలీస్‌ స్టేషన్‌కు రావాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే ఎత్తవద్దని, వారు పంపించే లింకులు ఓపెన్‌ చేయవద్దని తెలిపారు. తమ బ్యాంకు, ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు ఎవరికి తెలుపవద్దన్నారు. గ్రామాలలో ఎవరైనా గంజాయి అక్రమంగా కలిగి ఉన్నా ఇతరులకు అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే డయల్‌ 100, లేదా సిద్దిపేట పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 8712667100 సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యం ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామ్మోహన్‌ రావు, ఉపసర్పంచ్‌ లత, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచన, వార్డు సభ్యులు, పోలీస్‌ సిబ్బంది, కళాబందం సిబ్బంది బాల్‌ నర్స్‌, రాజు, తిరుమల,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.