– పిల్లలను కిడ్నాప్ చేసే వారు అంటూ దాడులు చేయొద్దు
– సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే
నవతెలంగాణ-కోదాడరూరల్ : పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అని కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లు ప్రజలు నమ్మవద్దు అని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తోగరాయి గ్రామంలో ప్రజలు అనుమానంతో ఒక వ్యక్తిపై దాడి చేసి పట్టుకుని పోలీసు వారికి అప్పగించారు, కోదాడ రూరల్ పోలీసు వారు ఘటన స్థలానికి చేరుకుని అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని మానసిక స్థితి సరిగాలేదు అని తెలిసినది. పుకార్లు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించవద్దు అని ఎస్పి కోరినారు.ప్రజలు, తల్లిదండ్రులు పుకార్లను నమ్మవద్దు అని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు అధికారులకు, డయల్ 100 కు, సూర్యాపేట జిల్లా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ నంబర్ 8712686026 తెలపాలని ఎస్పి విజ్ఞప్తి చేసినారు. అనుమానంతో ఎవ్వరిపై కూడా భౌతిక దాడులకు పాల్పడవద్దు అని ఎస్పి కోరినారు.