– కుటుంబ నియంత్రణ లో అనేక అధునాతన పద్ధతులు
– వాటిపైన అవగాహన పెంచాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అధిక జనాభా వల్ల కలిగే అనర్ధాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తా వద్ద నుండి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక జనాభా వల్ల పేదరికం, నిరక్షరాస్యత, వనరుల లేమీ వంటివి ఏర్పడతాయని అన్నారు. సహజ వనరులు స్థిరంగా ఉంటాయని, ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియోగించుకోవచ్చని, ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపోక పేదరికం, నిరక్షరాస్యత వంటివి పెరిగిపోతాయని అన్నారు. అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాలలో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు. అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం, పేదరికం వంటివి ఉండవని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చాలావరకు ఒకరు, ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారని,అందరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ ,ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబ నియంత్రణలో అనేక అధునాతన పద్ధతులు వచ్చాయని, వీటివల్ల తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పారు. తక్కువ జనాభాతో భవిష్యత్తు తరాల జీవితం బాగుంటుందని అన్నారు. జనాభా వల్ల కలిగే అనర్ధాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, డిఎల్ఓ హరికృష్ణ, డిఐఓ పద్మ, ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి అరుంధతి, పిఓడిటి గీతావాణి, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.