గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

– జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్
నవతెలంగాణ-మల్లాపూర్: గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఉన్న ఎస్సారెస్పీ ద్వారా గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారని ఆయా గ్రామాల గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, పశువుల మేతకు, వ్యవసాయ పనులను నిమిత్తం వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలలో మైకు ద్వారా లేదా డప్పు చాటింపు ద్వారా సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు. అలాగే నీటి  ప్రవాహాలను దాటకూడదని తెలిపారు. పాత ఇండ్లలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, తాసిల్దార్ వీర్ సింగ్, ఎస్సై కిరణ్, ఎఫ్ఎ సి ఎంపీడీవో జగదీష్ తదితరులు పాల్గొన్నారు.