ఆన్లైన్,గొలుసు కట్టు,మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని,గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లి మోసపోవద్దని తుంగతుర్తి సర్కిల్ సీఐ శ్రీను నాయక్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాల పట్ల,ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దని అన్నారు.కొన్ని గంటల్లో,ఒక రోజులోనే,వారం రోజుల్లోనే రెట్టింపు నగదు ఇస్తానంటూ,ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ,ఆశావాహులకు ఎర వేస్తున్నారని,ఆన్లైన్ ట్రేడింగ్, గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారని,వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.స్టూడెంట్స్,రిటైర్డ్ ఉద్యోగులు,మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రకటనలతో,నమ్మిస్తూ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన సంవత్సరానికి రెట్టింపు అవుతుందని,తమ కంపెనీ మెంబర్గా జాయిన్ అయ్యి వాటిని అమ్మితే లక్షలు సంపాదించుకోవచ్చు అని మాయమాటలు చెప్పి జాయిన్ చేయించడం జరుగుతుందన్నారు. ప్రొడక్ట్స్,గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు,క్రిప్టో కరెన్సీ తో పాటు ఎడ్యుకేషన్ కు సంబంధించిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సెమినార్లు పెట్టి లక్షలాది మందిని బురిడీ కొట్టిస్తున్నారు అని అన్నారు.సైబర్ నేరగాళ్లు కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఆడ్ చేసి ఆ గ్రూపులో ఉన్న మిగతా సభ్యులు చాలా డబ్బులు గెలుచుకున్నట్లుగా మెసేజ్లు స్క్రీన్ షాట్లు పెడుతూ మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని తెలిపారు.చాలామంది విదేశాల్లో ఉండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను ఒక రాకెట్ గా నడుపుతారని భారీ లాభాలతో పాటు లగ్జరీకార్లు, ఫారెన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వల పన్నుతారని తెలిపారు.సోషల్ మీడియాలో మోసపూరిత ప్రకటనలు చూసి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన సొమ్మును అనాలోచితంగా అత్యాశకు పోయి గుర్తు తెలియని యాప్ లలో పెట్టుబడి పెట్టి మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దని అన్నారు.అనుమానాస్పద ప్రకటనలు,వెబ్ లింకులు,ఏపీకే ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దని, ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా జిల్లా సైబర్ వాట్సాప్ నెంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.