ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో 

People should be alert: MPDOనవతెలంగాణ – పెద్దవంగర

మండలంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. ఆదివారం మండలంలోని గంట్లకుంట-రంగాపురం, గంట్లకుంట-అవుతాపురం, రాజమాన్ సింగ్ తండాలోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల మూలంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, గ్రామాల్లోని కుంటలు, చెరువులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. విద్యుత్‌ స్తంభాలు విరిగినా, ప్రమాదాలు పొంచి ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శిధిలావస్థలోని నివాసాల్లో ఉండరాదన్నారు. వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పుశువులు, గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు మురళి, అశోక్, జూనియర్ అసిస్టెంట్ ఉప్పలయ్య ఉన్నారు.