
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని గాడిఖాన బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి ప్రత్యూష అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ..ఎండలు ముదురుతున్నాయని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణులు, బాలింతలపై ఎండప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీర్ఘకాలిక వ్యాధులు, మద్యం తా గేవారు, అతిగా ఔషధాలు తీసుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ తాకితే నీటి శాతం లోపిస్తుందని, శరీరం అదుపుతప్పి కాళ్లనొప్పులు, జ్వరం, వాంతులు, విరోచనాలు, సంభవిస్తాయని వివరించారు. వడదెబ్బకు గురైతే వెంటనే చల్లని ప్రాంతానికి తీసుకెళ్లి గాలి తగిలేలా.. దు స్తులు వదులుగా ఉండేలా చూడాలన్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల నీరు తాగాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోడ్డుపై దొరికే తినుబండారులకు దూరంగా ఉండాలని సూచించారు. కొబ్బరి నీళ్లు, తగినంత మంచినీరు, పండ్లు కూరగాయలు, మజ్జిగ తీసుకోవాలని తెలిపారు.