– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో 2025 గోడపత్రికను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఒకటి జనవరి 2025 నుండి ఈనెల 31 వరకు నెల రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రత మాసవోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించటం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచడం పాఠశాలలు కళాశాలలో దీనిపై పిల్లలకు పలు పోటీలు నిర్వహించాలని కలెక్టర్ రవాణా అధికారులకు తెలిపారు. అలాగే ముఖ్య కూడలిలో రోడ్డు ప్రమాద నివారణ పై ప్రదర్శనలు నిర్వహించడం ,సురక్షిత రవాణాపై పల్లె నుంచి పట్టణాల వరకు ప్రచార యాత్రలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి, ఎంబీఏ జయప్రకాశ్ రెడ్డి, ఈ ఆదిత్య, డి బి ఐ ఆంజనేయులు, సహాయ వాహన అధికారులు పాల్గొన్నారు.