ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలి

– విద్యార్థులపై శ్రద్ధ అవసరం
– నివారణకు  నీటితో పాటు, ద్రవపదార్థాలు ఎక్కువగా వాడాలి
– కూలీలకు  తాగు నీరు, నీడ సదుపాయాలు కల్పించాలి
– జిల్లా  కలెక్టర్  దాసరి హరిచందన
– అవగాహన పత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని  జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  వేడిమి సంబంధ వ్యాధుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం  ఇప్పుడే 42.5  డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయని,  వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు   శరీరానికి ఎండ వేడిమి తగలకుండా టోపీ ధరించాలని శరీరం నుండి చెమట ఎక్కువగా పోవడం, వాంతులు, విరోచనాలు వంటివి సంభవిస్తే తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని సూచించారు.వెసవి కాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలని, అలాగే ద్రవపదార్థాలు వాడాలని, పేర్కొన్నారు. ఉదయం సాయంత్రం, సమయాలలో మాత్రమే బయటికి వెళ్లాలని, కూలీలు పని చేసే చోట కుండలద్వారా తాగు నీరు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఉపాధి హామీ పథకం కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోక సభ ఎన్నికలు మేలో నిర్వహిస్తున్నందున ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందులు పడకుండా  టెంట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అందరూ వారి వారి పరిధిలోని సంక్షేమ హాస్టళ్లకు  వెళ్లి పిల్లలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన  ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని, అలాగే కళాశాలల్లో సైతం అవగాహన కల్పించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడిగాలులకు గురికాకుండా తీసుకునే ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై అవగాహన తీసుకురావాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, తీవ్రమైన వేడిగాలుల వల్ల ఏలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని, ఎవరైనా వడదెబ్బకు గురైనట్లయితే తక్షణమే చికిత్స అందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో తాగునీటి ట్యాంకులు అన్నింటిని శుభ్రం చేసి పించాలని ఆదేశించారు. అంతేకాక మూగ జంతువుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేయాలని  తెలిపారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ  ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, సంవత్సరం 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు సైతం ఉన్నాయని, ఇప్పటివరకు తీవ్రమైన వేడిగాలులకు సంబంధించి  ముందు జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వడదెబ్బకు గురైన వారికి ప్రథమ చికిత్సగా ఇచ్చేందుకుగాను ప్రతి ఆశ వర్కర్ దగ్గర 50, ఏ ఎన్ ఎం వద్ద 100, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో2000 ఓ ఆర్ ఎస్ పాకెట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని,  ఇవే కాకుండా బస్టాండ్ , రైల్వే స్టేషన్ లలో సైతం  ఓ అర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయని, మండల స్థాయిలో తాహసిల్దార్,  ఎస్సై, వైద్య అదికారుల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వడదెబ్బకు గురికాకుండా చేయవలసిన పనులు, చేయకూడని పనుల అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ , నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ సంచాలకులు ద్వారా రూపొందించిన  కరపత్రాన్ని, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.