– ‘ఎంజీఎం’ సమీక్షలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ – మట్టేవాడ
పేదల ఆస్పత్రి ఉత్తర తెలంగాణకే వరప్రదాయనిగా పేరుపొందిన వరంగల్ ఎంజీఎంలో పేరుకు తగ్గట్టుగా వైద్య సేవల్లో లోటు లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎంజీఎం అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వరంగల్ ఎంజీఎంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎంజీఎం సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్, వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో అందుతున్న సేవలు, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఉన్న సౌకర్యాలపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఔషధాల అందుతున్న తీరు, 14 శస్త్ర చికిత్స కేంద్రాల్లో జరుగుతున్న ఆపరేషన్ల తీరుపై ఆరా తీశారు. శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయంపై సూపరింటెండెంట్‌ను వివరణ అడిగారు. ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడే ఉన్న టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వరంగల్ డివిజనల్ ఇంజనీర్‌ను ఆదేశించారు. రెండు నిమిషాలు కూడా కరెంటు కోత అనేది ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రం అయిన దృష్ట్యా ఎంజీఎం ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది, ఔషధాలు, ఆక్సిజన్ వెంటిలేటర్ల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంజీఎంలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 21 నుంచి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజీఎంలో చేరి చికిత్స పొందుతున్నారని, అందులో ఇద్దరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ముగ్గురు చిన్నారులకు ప్రస్తుతం కరోనా చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెంటిలేటర్ అవసరం లేకుండా చిన్నారులు చక్కగా ఉన్నారన్నారు. మరో నలుగురు పెద్దవాళ్లతో కలిపి మొత్తం ఏడుగురు ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరస్ ఉధృతి ఎక్కువయినా రోగులకు ప్రాణవాయువు అందించడంలో ఇబ్బందులు తలెత్తకుండా 1200 ఆక్సిజన్‌తో అనుసంధానం చేసిన బెడ్స్, 3 ఆక్సిజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విద్యుత్ అంతరాయం తలెత్తినా 5 జనరేటర్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేలా సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ఎంజీఎంకు కావలసిన సౌకర్యాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపల్ దివ్వెల మోహన్ దాస్, టీఏఎంఐడీసీఎస్ ఈ దేవేంద్ర కుమార్, ఎన్‌పీడీసీఎల్ డీఈ మల్లికార్జున్, ఆర్‌ఎంఓ మురళి, అడిషనల్ ఆర్‌ఎంఓలు, ఆస్పత్రి వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.