– ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి
– రోజు 4 నుంచి 5 గంటలు కోత
– ఎండలకు ఉక్కపోతాతో ఉక్కిరి బిక్కిరి
– ఫోన్ చేసినా స్పందించని అధికారులు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలో విద్యుత్ కోత తీవ్రమయింది. కరెంట్ కష్టాలతో తెలంగాణ పల్లెలు అల్లాడుతున్నాయి. పల్లె ప్రజలు పగటి పూట కరెంట్ సంగతి పూర్తిగా మరిచిపోయారు. ఇక రాత్రి వేళల్లో కూడా కరెంట్ చాలా పరిమితంగా సరఫరా అవుతోంది. కోతల నిడివి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక కరెంట్ కోతలతో రైతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మండలంలోని పెద్దవూర, వెల్మగూడెం, పులిచర్ల, బెట్టేల తండలో సబ్ స్టేషన్లు ఉన్నాయి. గత వారం రోజులుగా విద్యుత్ కోతలు అధికమాయ్యాయి. మండలంలో ఉన్న సబ్ స్టేషన్లో ఇదే పరిస్థితి ఉంది. త్రీఫెజ్ కరెంట్ లేక గ్రమాల్లో పంచాయతీ బోర్లు నడవడం లేదు. అంతేకాక రెండు రోజులుగా మిషన్ భగీరద నీళ్లు రావడం లేదు.. కనీసం అవసరాలకు కూడా కరెంట్ లేక నీళ్లు దొరకడం లేదు. రోజుకి నాలుగు నుంచి ఐదు గంటల మాత్రమే పొలాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారిగా చేస్తుండడంతో కొద్ది కొద్దిగా వస్తున్న నీళ్లు పొలాన్ని కొద్దిగా కూడా తడపలేకపోతున్నాయని, దీని వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళాలేని కరెంట్ కోతలతో గహ వినియోగదారులు, చిన్నతరహా కుటీర పరిశ్రమలు నిర్వహించేవారు, చిరు వ్యాపారులు, కరెంటుపై ఆధారపడ్డ కులవత్తుల వారు.. ఇలా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకు ఆరు గంటలకుపైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారంటే విద్యుత్ సంక్షోభం రాష్ట్రంలో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లోటు అసాధారణ స్థాయికి చేరుకుందని, డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మండల వ్యాప్తంగా కోతలు అమలుచేస్తున్నామని విద్యుత్ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఈ విషయంలో ట్రాన్స్ కో జెన్ ఉన్నతాధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. డిమాండ్ 154 మిలియన్ యూనిట్లు ఉండగా ఉత్పత్తి మాత్రం 128 యూనిట్లే ఉందని దీనివల్ల 25 మిలియన్ యూనిట్ల లోటు ప్రతీరోజు వస్తోందని వారు అంటున్నారు. ఈ కారణంగా విద్యుత్ కోతలను అమలుచేయక తప్పని పరిస్థితి రాష్ట్రంలో నెలకోందని ట్రాన్స్ కో అధికారులు చెపుతున్నారు. గత వారం రోజులుగా మండలంలో కరెంట్ కోతలు విధిస్తుండడంతో పొలాలు ఎండిపోతున్నాయి. పగలు, రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలు విధిస్తున్నారు. మంగళవారం రాత్రి నైట్ 7గంటనుంచి 10 వరకు, బుధవారం ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3మూడు గంటల నుంచి 7 గంటల వరకువిద్యుత్‌కు అంత రాయం కలుగుతుంది.