– నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
నవతెలంగాణ-కొత్తగూడెం
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. శుక్రవారం నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి, పీడీఏస్ బియ్యం అక్రమరవాణా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్‌ను గుర్తించి గంజాయిని అమ్మే వ్యక్తులతో పాటు గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల వద్ద నుండి డబ్బులు దోచుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారని, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్), ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజరు బాబు, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.