మోడీ వైఫల్యాలను గుర్తించిన ప్రజలు

మోడీ వైఫల్యాలను గుర్తించిన ప్రజలు– భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నం
– కాషాయపార్టీకి వ్యతిరేకంగా మరింత మెరుగైన ప్రచారం అవసరం : ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీవనోపాధి, ధరల పెరుగుదల తదితర ఆర్థిక రంగంలో మోడీ వైఫల్యాలను ప్రజలు గుర్తించారని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ తెలిపారు. మంగళవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ‘పార్లమెంటు ఎన్నికలు – కార్మికవర్గ కర్తవ్యం’ అనే అంశంపై హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నాగేశ్వర్‌ ప్రధాన వక్తగా విచ్చేసి ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీ ఎత్తుగడలు, వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన ప్రచార వ్యూహం తదితర విషయాలను వివరించారు. ఈ సందర్భంగా విశ్వసనీయత కలిగిన పలు సంస్థలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయన ఫలితాలను విశ్లేషించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి రావాలని కోరుకునే వారు ఎందుకు కోరుకుంటున్నారనే విషయంలో అంత స్పష్టతనివ్వలేదని తెలిపారు. అదే పీఎం మోడీ మరోసారి అధికారంలోకి రావద్దనే వారు స్పష్టంగా జీవనోపాధి దెబ్బతింటున్నదనీ, నిరుద్యోగం పెరిగిందనీ, ధరలు పెరిగాయంటూ స్పష్టత నిచ్చారని చెప్పారు. సీఎస్‌డీఎస్‌ – లోక్‌ నీతి, ది హిందూ కలిసి చేసిన సర్వే, కన్జప్షన్‌ ఎక్స్‌పెండిచర్‌ సర్వే తదితర సర్వేలను ఆయన వివరించారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం పెరగటం తదితర అంశాల్ని ముందుబెట్టి కార్మికోద్యమం సాగాల్సిన అసరమున్నదని అభిప్రాయపడ్డారు.
పేదరికాన్ని తగ్గించకపోయినా నిటిఅయోగ్‌ పేదరికం తగ్గిందని చెబుతున్నదని తెలిపారు. పేదరికం నిర్వచనాన్ని మార్చి పేదరికం తగ్గినట్టుగా బీజేపీ ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. కొత్త నిర్వచనం ప్రకారం… దేశంలో బిచ్చగాళ్లు కూడా దారిద్య్ర రేఖకు ఎగువన ఉంటారని తెలిపారు. నిజంగా పేదరికాన్నే తగ్గిస్తే 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ సరకుల అవసరమెందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా ప్రజల నుంచి 2022-23 ఒక్క ఏడాదిలో రూ. ఏడున్నర లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేశారని తెలిపారు. అయితే మోడీ ఆర్థిక వైఫల్యాలు ఉన్నప్పటికీ హిందూ మత ఆధిపత్యాన్ని నిలబెట్టే పాలకుడిగా ప్రజలు ఆయన్నే ఒప్పుకునేలా బీజేపీ ప్రచారం పారుతున్నదని తెలిపారు.
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక వైఫల్యాలే 2019లోనూ ఉన్నాయనీ, అయితే బీజేపీ పుల్వామా, బాలాకోట్‌ వంటి భావోద్వేక అంశాలతో గట్టెక్కిందని గుర్తుచేశారు. పుల్వామా ఘటనకు బీజేపీ వైఫల్యమే కారణమైనా, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుందని చెప్పారు. మరోసారి పాకిస్తాన్‌, చైనా అంటూ రెచ్చగొడుతున్నా తగిన స్పందన ప్రజల నుంచి రాకపోవడంతో కచ్చీతీవుల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని తెలిపారు. బీజేపీ తెస్తున్న యునిఫాం సివిల్‌ కోడ్‌ తదితర అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
ఇలాంటి అంశాలను అడ్డుపెట్టుకుని మిగిలిన పార్టీలు మైనార్టీలకు అనుకూలమనీ, మెజార్టీ హిందువులకు వ్యతిరేకమని చిత్రీకరిస్తున్నా యని హెచ్చరించారు. ఇప్పటికీ దేశంలో 11 శాతం మంది మాత్రమే హిందూ రాజ్య భావనకు అనుకూలంగా ఉండగా, మెజారిటీ ప్రజలు బహుళత్వ భారతదేశాన్నే ఇష్టపడు తున్నారని తెలిపారు. ఎస్‌.వీరయ్య మాట్లా డుతూ తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పోరాడుతుంటే దానికి రామున్ని మొక్కితే చాలన్నట్టు మోడీ సర్కారు చెబు తున్నది. వేతనాలు పెరగాలన్నా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా ఎక్కడికక్కడ పోరాడితే తప్ప మరో మార్గం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, ఎస్‌.రమ, పి.జయలక్ష్మి, నవతెలంగాణ సంపాదకులు సుధాభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.