అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం– మేడ్చల్‌ జెడ్పీలో ప్రశ్నల వర్షం
– సమాధానం చెప్పలేకపోయిన అధికారులు
– జెడ్పీటీసీలు, ఎంపీపీల అసహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధికారులపై ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు అధికారుల వద్ద సరైన సమాధానం, సమాచారం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన మేడ్చల్‌లో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా శాఖలపై నివేదకలు సమర్పించారు. ఈ సమయంలో సభ్యులు ప్రశ్నలు వేశారు.
విద్య, వైద్య, విద్యుత్‌, గ్రామ పంచాయతీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు రఘునాథస్వామి, రమణ మూర్తి సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. పంచాయతీలు అస్తవ్యస్తంగా మారాయని, గ్రామ పంచాయతీ సెక్రెటరీలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని నిలదీశారు. జీపీల్లో కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని సభ్యులు ప్రశ్నించారు.
పేదల వద్ద ట్యాక్స్‌ వసూలు చేస్తున్న అధికారులు కమర్షియల్‌ ట్యాక్స్‌ ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. పల్లె దవాఖానాల్లో వైద్యుల కొరత ఉందని, పీసీహెచ్‌సీలు సకాలంలో వైద్యం అందించడం లేదని సభ్యులు అన్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి..? సర్కార్‌కు నివేదించారా..? అని డీఎంఅండ్‌హెచ్‌ఓను నిలదీశారు. వైద్యులు సమయ పాలన పాటించడం లేదని, ప్రయివేటు హాస్పిటల్స్‌ను అదుపు చేయడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ డీఎంఅండ్‌హెచ్‌ఓ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.