– ఉదయం 4 గంటల నుండే క్యూలో పడిగాపులు
– చలిలో అక్కడే నిద్రిస్తూ.. టోకెన్ తీసుకుంటున్న పరిస్థితి
– వికారాబాద్ జిల్లా తాండూరు పోస్టాఫీస్ వద్ద బారులు తీరిన జనం
– ఆధార్ సెంటర్లు పెంచాలని డిమాండ్
నవతెలంగాణ-తాండూరు
ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో అప్డేట్ కోసం ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అందులో తాండూరులో ఒకే సెంటర్ ఉండటంతో అప్డేట్ కోసం జనాలు ఉదయం 4 గంటల నుంచి చలిలో పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో సోమవారం చోటు చేసుకున్నది. ప్రభుత్వం పలు పథకాల కోసం రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయమని చెబుతోంది. దాంతో ప్రజలు ఆధార్ కార్డు సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాండూర్ పట్టణ కేంద్రంలో పోస్టాఫీస్ వద్ద నిత్యం ఆధార్ అప్డేట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రోజుకు సుమారు 30 నుంచి 40 మంది వరకే ఉండేవారు. అయితే ప్రజా పాలన దరఖాస్తులతో పాటు బ్యాంకు తదితర వాటి కోసం ప్రతిదానికి ఆధార్ అవసరం ఉండటంతో ప్రజలు ఉదయం నాలుగు గంటలకు వరుసలో నిలబడాల్సి వస్తోంది. తాండూర్ నియోజకవర్గంగా ఆధార్ సెంటర్ల్లు సరిగ్గా లేకపోవడంతో ఈ పోస్టాఫీస్ వద్ద సోమవారం ఉదయం 4 గంటలకే చలిలో భారీ ఎత్తున జనాలు ఎగబడ్డారు. లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దాంతో జనాలపై ఆధార్ నిర్వా హకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు పెద్ద మొత్తంలో రావడంతో టోకెన్లు ఇచ్చారు. నాలుగు, ఐదు రోజుల డేట్లు వేసి ఇచ్చే టోకెన్ల కోసం కూడా ప్రజలు ఎగబడ్డారు. వృద్ధులు, చిన్నారులు సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉంటే క్యూలో నిల్చున్నా ఆధార్ అప్‌డేట్ అవుతుందనే నమ్మకం లేకుండా పోయిం దని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.