
– వార్త ప్రచురితం అయ్యాక పగిలిన కిటికీ అద్దం నుండి పాము సైతం లోపలికి వచ్చింది.
– అడిగితే బడ్జెట్ లేదని కారణం చెపుతున్నారు
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండల ప్రాథమిక వైద్యశాల వైద్యులు ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిండ్రు. జిల్లా వైద్యాధికారిణి చెప్పిన ఆమె పట్టించుకోవడం లేదు.ఆసుపత్రి అంటే గుడి తర్వాత అంతటి స్థానం సంపాదించుకుంది. కానీ ఇందులో పని చేసే వైద్యులు ప్రజల ప్రాణాలకు ఏమౌతుందో అని కూడా లెక్కచేయడం లేదు. వివరాల్లోకి వెళితే ఏర్గట్ల మండల ప్రాథమిక వైద్యశాల యొక్క వెనుక వైపు కిటికీ అద్దం పగలడంతో గత నెల 20 వ తేదీన నవతెలంగాణ పత్రికలో “రోగులకు భద్రత కరువు”అనే కథనం రావడంతో స్పందించిన జిల్లా వైద్యాధికారిణి నాలుగు రోజుల తర్వాత ఏర్గట్ల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కిటికీ అద్దం సరిచేయవలసిందిగా ఆదేశించారు. అయిన వినని వైద్యులు నెల అయినా కిటికీ అద్దం బిగించకపోవడంతో వెనుక వైపు నుండి పాము వచ్చి, ఓ మూలన చేరడంతో గమనించిన వైద్య సిబ్బంది పాములు పట్టే అతన్ని పిలిపించినట్టు వారి సిబ్బంది ద్వారా తెలిసింది. ఈ ఒక్క అద్దమే కాక వైద్యశాలకు ముందు గల ఫార్మసీ గది అద్దం కూడా పగలడంతో దానికి కూడా అట్ట ముక్క పెట్టి తమ పనిని కానిచ్చేస్తున్నారు. మందులు ఇచ్చే గదిని పరిశీలించగా… మొత్తం గదంతా ఊపిరాడకుండా మందుల పెట్టెలతో చిందరవందరగా ఉంది. ఒకవేళ వైద్యులకు గాని, రోగులకు గాని ఏ సమయంలోనైనా పాము కాటు వేస్తే విరుగుడు మందు కూడా ఇక్కడ లేదు.దాని కోసం కమ్మర్ పల్లి,మోర్తాడ్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల్సిందే.అంతలోపు రోగి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు. పగిలిన అద్దాలు అమర్చరా అని వైద్యులను, సిబ్బందిని నవతెలంగాణ అడగగా బడ్జెట్ లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారు. 500 వందల రూపాయల అద్దం కోసం బడ్జెట్ లేదు అని సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇకనైనా జిల్లా, మండల వైద్య యంత్రాంగం మేలుకొనకపోతే వైద్యం కోసం వచ్చే ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.