కాంగ్రెస్ ను నమ్మితే ప్రజల బతుకులు అధోగతి : కేటీఆర్

నవతెలంగాణ-భిక్కనూర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు అదే జరిగితే లంచగొండులు పైరవికారుల దందా మొదలవుతుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి ,కాచాపూర్ గ్రామాలలో రోడ్డుషోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 పేజీలతో 420 అబద్దాల మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని ఎద్దేవ చేశారు. ధరణి రద్దు చేస్తే రైతులకు రైతు బీమా పంటల పెట్టుబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒకరికి సన్న బియ్యం ఇస్తామన్నారు. ఢిల్లీ దొరలు కావాలో గల్లి లీడర్ కావాలో మీరే తేల్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి ప్రాంతం మరింత అభివృద్ధి కావాలన్నా ఉద్దేశంతో కేసీఆర్ ను పోటీ చేయాలని కోరడం జరిగిందన్నారు. తన విన్నపాన్ని మన్నించి ఆయన ఇక్కడి నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. భారీ మెజార్టీతో కేసీఆర్ను గెలిపిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎంపీపీ గాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీ రాజలింగం, సులోచన సుదర్శన్, ఎంపిటిసి సభ్యులు సాయ గౌడ్, మంజుల రాములు, సొసైటీ అధ్యక్షులు రాజా గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ కృష్ణ గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, మాజీ ఎంపీపీ సుదర్శన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.