– వ్యవసాయ సలహాదారుడు పోచారం
నవతెలంగాణ – బాన్సువాడ/నసురుల్లా
ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో బాన్సువాడ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా పోషణ సంబురాలలో ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ బాలికలకు హ్యాండ్ వాష్, మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మరియు గర్భిణీలకు శ్రీమంతం చేశారు. పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పిల్లలకు ఎత్తు, బరువు కొలవడం, తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం, టీకాలు వేయించడం చేస్తారని. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, శిశువు పుట్టినప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారని. పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టించడం, ఆరు నెలల వరకు తల్లి పాలు తప్పనిసరిగా ఇచ్చేలా అవగాహన కల్పించడం, ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం , గర్భిణులు, బాలింతలు పోషకాల కోసం ఆకుకూరలు, తృణధాన్యాలు విధిగా తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.