చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసమో, వ్యాపార లావాదేవీల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో మనుషులతో సంబంధాలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సంబంధాల వల్ల మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఉండవు. అందుకే మానవులంతా ఒకే జాతిగా ఐక్యతతో, అభివృద్ధి సాగించే దిశలో ఉండేటట్టు ఉండాలి. మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాలు మనుషులకు సహజగుణాలుగా ఉండాలి. ఇవన్నీ ఉండి సాటి మానవులకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంటే చాలు, అదే మనుషుల మధ్య మంచి సంబంధాలకు దారి తీస్తుంది. కష్టాల్లో ఉన్నపుడు వారి కన్నీళ్లను తుడిచి వారికి అవసరమైన సాయం చేసినప్పుడే మనం మనుషులుగా మిగులుతాం. మానవత్వంతో మెలగడమంటే ఇదే.
మానవుడు సంఘజీవి. దానివల్లనే మానవులమధ్య సంబంధాలు, బాంధవ్యాలు బలంగా ఉంటాయి. పరస్పర సహాయ సహకారం లేకుండా మనుగడ సాగించడం అసాధ్యం. మానవ సంబంధాలనేవి పటిష్టంగాను, పవిత్రంగాను ఉంటే మానవ ప్రగతి ఇతోధికంగా పెరుగుతుంది. అవి ఒకవేళ అపవిత్రాలు కళంకితాలుగా ఉంటే మాత్రం మానవ మనుగడ ప్రగతిపథంవైపుకు కాదు, అసలు నడకనే కుంటు పడుతుంది. మనుషుల మధ్య ఏర్పడే మానవ సంబంధాలు మానవత్వంతో ముడిపడి ఉండాలి. విచక్షణ, ఆలోచనాశక్తి ఉన్న మానవుడు మానవీయ విలువలతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలి. అపుడే బాధలు లేని సుఖమయ జీవితం సాధ్యమవుతుంది.
కేవలం రక్తసంబంధం ఉంటేనే వారితో మంచి స్నేహసంబంధం కలిగి ఉండడం కాక ప్రతి మనిషిని స్నేహహస్తంతో స్వాగతించాలి. కేవలం మానుషులనే కాక ఇతర జంతుకోటిని కూడా ప్రేమతోనే మచ్చిక చేసుకోవాలి. మనుషులతో పాటు ఎన్నో విధాలుగా సహాయం అందించే జంతుప్రాణి కూడా మనకు అవసరమైనదే. ప్రకృతి అంతా సమతౌల్యతతో ఉండాలంటే మానవులే కాక చెట్టు చేమలతో పాటుగా జంతుజాలం కూడా మంచి మనుగడ సాగించాల్సిందే. అప్పుడే మానవాళి ప్రగతి సజావుగా సాగుతుంది.
చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసమో, వ్యాపార లావాదేవీల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో మనుషులతో సంబంధాలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సంబంధాల వల్ల మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఉండవు. అందుకే మానవులంతా ఒకే జాతిగా ఐక్యతతో, అభివృద్ధి సాగించే దిశలో ఉండేటట్టు ఉండాలి. మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాలు మనుషులకు సహజగుణాలుగా ఉండాలి. ఇవన్నీ ఉండి సాటి మానవులకు అవసరమైనప్పుడు సాయం చేస్తుంటే చాలు, అదే మనుషుల మధ్య మంచి సంబంధాలకు దారి తీస్తుంది. కష్టాల్లో ఉన్నపుడు వారి కన్నీళ్లను తుడిచి వారికి అవసరమైన సాయం చేసినప్పుడే మనం మనుషులుగా మిగులుతాం. మానవత్వంతో మెలగడమంటే ఇదే.
అయితే రానురాను మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతుంది. మనుషులమనే విషయాన్ని మరిచి మృగాల్లా మారిపోతున్నారు. నోరులేని అమాయక అడవి బిడ్డల్ని సైతం తమ స్వార్థప్రయోజనాలకు వాడుకుంటున్నారు. చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనే దీనికి నిదర్శనం. సాటి మానవులను తనలాంటి వారు అని గుర్తించక వారిని నీచంగా చూస్తున్నారు. హింసించి ఆనందిస్తున్నారు. ఇలాంటి వారిలో మృగాలు తప్ప మనుషులు ఎలా కనిపిస్తారు? ఈ విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకుని ఆత్మపరిశీలన చేస్తే అర్థమవుతుంది.
‘మానవసేవే మాధవసేవ’ అన్నట్లుగా మానవులందరూ మిత్రులవ్వాలంటే ఒకరికోసం ఒకరు నిలబడాలి. అదే జీవన సంబంధం. శరీరం శాశ్వతం కాకపోవచ్చు. మనం చేసే చర్య శాశ్వితం. ఎపుడైతే మానవత్వం మరిచిపోతామో అపుడు అన్యాయం పెచ్చు మీరుతుంది. అప్పుడే పిల్లి కూడా పులౌతుంది అనేది నిజమవుతుంది. అణిచివేత నుండే పోరాటం పుడుతుంది. శతాబ్దాలుగా ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కనుక మనుషులుగా పుట్టినందుకు అందరూ విలువల్ని పాటిస్తూ మానవీయతతో మెలిగితే చాలు. ప్రపంచంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. మనలోని ప్రేమను పెంచుకుంటే మానవత్వం అంకురిస్తుంది. ఆ అంకురమే విచ్చుకుని మానవత్వ పరిమళాలను వెదజల్లుతుంది.