పెరియార్‌, అంబేద్కర్‌ కోరిందీ, సనాతన ధర్మ నిర్మూలనే…

Periyar, Ambedkar wanted, Sanatana Dharma Nirmulane...హిందూమతం ఒక ప్రవక్తపై ఆధారపడిన మతం కాదు. దానికి ఒకే ఒక గ్రంథం లేదు, లేదా హిందూ అనే పదం పవిత్ర గ్రంథాలలో భాగంగా లేదు. ఇది, హిందూమతం దేనినైతే సూచిస్తుందో దానికి భిన్నమైన అర్థాన్ని ఆపాదించ డానికి, వివిధ రకాల వ్యాఖ్యాతలు, సంస్కర్తలకు, తగినంత స్వేచ్ఛను ఇస్తుంది, ఆఖరికి ఇదొక మతం కాదు, కానీ ”జీవన విధానం” అని నిర్వచించేంత దాకా వెళుతుంది. అందువలన ఇది బ్రాహ్మణ ( వైదిక, మనుస్మృతి, కుల, లింగ శ్రేణీగత వ్యవస్థ ఆధారంగా), శ్రామణిక (నాథ్‌, తంత్ర, భక్తి, శైవ, సిద్ధాంత) సాంప్రదాయాల కింద విస్తృత ప్రాతిపదికన వర్గీకరణ చేయబడిన విభిన్న ధోరణుల సమాహారం.
సనాతన అనే పదం ”శాశ్వతమైన మతాల” కోసం ఉపయోగంలో ఉంటూ వస్తుంది. ధర్మం అనే పదం ఆంగ్లంలోకి అనువదించడం కూడా అంత తేలికైన పని కాదు. ఇది సాధారణంగా అనేక విషయాలను సూచిస్తుంది, అందులో మతపరంగా నిర్దేశించిన విధి ప్రధానమైనది. ఇది ఆధ్యాత్మిక క్రమం, పవిత్రమైన చట్టాలు, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక సామరస్యాల పరిపూర్ణతను కూడా సూచిస్తుంది. ”నేను ఎందుకు హిందువునంటే” అనే తన రచనలో ధర్మాన్ని, ”మనం జీవించేదే” అని కూడా నిర్వచించవచ్చని శశిథరూర్‌ పేర్కొన్నాడు.
సనాతన ధర్మం అనే పదం హిందూ మతానికి, ముఖ్యంగా కుల, లింగ శ్రేణీగత వ్యవస్థను సమర్థించే బ్రాహ్మణీయ వాదన కోసం ఉపయోగించబడుతుంది. హిందూమతం అనేది బ్రాహ్మణీయ ధర్మశాస్త్రమని బీ.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన మాట కూడా ఇదే. హిందూ జాతీయవాద రాజకీయాల్ని ప్రదర్శిస్తున్న హిందూత్వ లేదా హిందూత్వానికి మూలం హిందూ మతమే. ఇది మనుస్మృతిని సమర్ధించడం ద్వారా సాంప్రదాయ కుల శ్రేణీగత వ్యవస్థను కూడా సమర్థిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, సనాతన ధర్మం నేడు కుల శ్రేణీగత వ్యవస్థ కోసం నిలుస్తుంది.
ఈ నేపథ్యానికి వ్యతిరేకంగా ”సనాతన ధర్మాన్ని నిర్మూలించండి” అనే ఉదయనిధి పిలుపును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌ కుమారుడు, తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి అయిన ఉదయనిధి, కుల సమానత్వం, పితృస్వామిక వ్యవస్థ నిర్మూలన కోసం పిలుపునిచ్చిన ఆత్మగౌరవ ఉద్యమ ప్రారంభకుడైన పెరియార్‌ రామస్వామి నాయకర్‌ సాంప్రదాయం నుండి వచ్చాడు. సమాజాన్ని శాసించిన బ్రాహ్మణీయ కట్టుబాట్లను పెరియార్‌ తీవ్రంగా విమర్శించాడు. తన ముందే తన సహౌద్యోగి అయిన బాపూ సాహెబ్‌ సహస్త్రబుద్దే, మనుస్మృతిని దహనం చేసే కార్యక్రమాన్ని బీ.ఆర్‌.అంబేద్కర్‌ పర్యవేక్షిం చాడు. అంబేద్కర్‌ చెప్పిన దాని ప్రకారం… ఈ గ్రంథం (మనుస్మృతి) కుల అసమానతల భాండాగారం. సమాజంపై బ్రాహ్మణవాద ఆధిపత్యంతో బాధపడిన అంబేద్కర్‌ ఇప్పుడు సనాతన ధార్మిక విలువలను ఉదాహరించి, యెయోలాలో ఇలా ప్రకటించాడు: ”నేను హిందువుగా పుట్టాను, అది నా చేతిలోది కాదు, కానీ నేను హిందువుగా మరణించను.”
కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రం సనాతన ధర్మం అని ఇప్పుడు ఉదయనిధి అన్నాడు.” పెరియార్‌ రామస్వామి, అంబేద్కర్‌లు వారివారి మార్గాలననుసరించి చెప్పిన విషయాలనే ఉదయనిధి తిరిగి చెపుతున్నాడు. ”ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో ముడిపెట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత్‌లో సనాతన ధర్మాన్ని అనుసరించే 80శాతం మంది ప్రజల జాతి నిర్మూలన చేయాలని పిలుపు ఇచ్చాడని” సనాతన ధర్మం అనే మాటలను ఉదయనిధి ఉపయోగిం చడంపై స్పందిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి, అమిత్‌ మాలవ్య ట్వీట్‌ చేశాడు. మాలవ్య, ఉదయనిధి స్టాలిన్‌ మాటలను వక్రీకరించడమే కాకుండా, సనాతన ధర్మానికి హిందూ మతం పర్యాయంగా ఉందని ధృవీకరిస్తున్నాడు.
వాస్తవమేమంటే, ఉదయనిధి పిలుపు కులనిర్మూలన కోసం ఇచ్చిన పిలుపు, ప్రజలను నిర్మూలించాలనే పిలుపు కాదు. అదే స్ఫూర్తితో ప్రజలు ఆయన వ్యాఖ్యలను ఆదరిస్తున్నారు కూడా. కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్‌ పిలుపు ఇచ్చినప్పుడు, ఆయన జాతిని నిర్మూలించాలనే పిలుపు ఏమీ ఇవ్వలేదు. అందువల్లనే అంబేద్కర్‌ ఉద్దేశ్యాలు, ఉదయనిధి ఆశయాలు ఒక్కటే. ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్న ‘ఇండియా’లో డీఎంకే భాగస్వామిగా ఉండడం వల్ల బీజేపీ నాయకులు ఉదయనిధి ప్రకటనను ఉద్దేశపూర్వకంగానే వక్రీకరిస్తున్నట్లు కనపడుతుంది.
కాంగ్రెస్‌ పార్టీ భారతీయ సంస్కృతిని అగౌరవ పరుస్తుందనీ, ఉదయనిధి మాట్లాడిన మాటలు ”ద్వేషపూరిత ప్రసంగానికి” సమానంగా ఉందని, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా బహిరంగ సభల్లో చెపుతున్నారు. అసలు వాస్తవం ఏమంటే, అసమానత్వ వ్యవస్థను నిర్మూలించాలని మాట్లాడటం ద్వేషపూరిత ప్రసంగం కాదు. ఉదయనిధి మాట్లాడిన మాటలు అంబేద్కర్‌, పెరియార్‌లు చెప్పిన మాటలకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రధానమైన విషయం ఏమిటంటే, బ్రాహ్మణీయ హిందూ మతం తనను తాను సనాతన ధర్మంగా చూపెట్టుకుంటుంది. గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పోరాటం చేసినప్పుడు, అంటరానితనం ఆచారానికి వ్యతిరేకంగా పని చేసినప్పుడు, ఆయన తనను తాను సనాతన ధర్మంతో గుర్తించుకున్నాడు. 1932 తరువాత కొన్ని సంవత్సరాల పాటు, గాంధీజీ అంటరానితనానికి వ్యతిరేకంగా పని చేయడం, దళితులు దేవాలయాల్లోకి ప్రవేశం పొందడానికి హక్కులు సాధించడమే ఆయన ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌద్ధమతం లాంటి భారతదేశంలోని భిన్నమైన మత సాంప్రదాయాలు కూడా తమను తాము సనాతనంగాను, శాశ్వత మైనవి గాను గుర్తించుకున్నాయి. నేడు, బ్రాహ్మణవాద, జాతీయవాద మిశ్రమాన్ని సృష్టించేందుకు సనాతన అనే పదాన్ని హిందూమతం కోసం ఉపయోగించే విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధిపత్య ధోరణి పని చేస్తుంది. అందుకనే ఉదయనిధి, కుల క్రమం యొక్క చెడులను వివరించడానికి శక్తివంతమైన సంకేతాలను సిద్ధం చేశాడు. కుల శ్రేణీగత వ్యవస్థను సమర్థించే విలువల నిర్మూలనకు ద్వేషపూరిత ప్రసంగం అనే ఆరోపణను అన్వయించకూడదు.
బీజేపీ నాయకులు, అధికార ప్రతినిధులు ఉదయనిధి ప్రకటనల్ని కారణంగా చూపుతూ… కాంగ్రెస్‌ పార్టీ పైన, ఇండియా కూటమి పైన ఎలాంటి ప్రాముఖ్యతలేని వాదనలతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ భారతీయ సంస్కృతిని ఏనాడూ గౌరవించలేదని చెప్పడం అంటే రాజకీయంగా లబ్ది పొందేందుకు నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదు. సాంస్కృతిక విభేదాల పట్ల గౌరవాన్ని నిలుపుకుంటూనే, భారతీయ గుర్తింపు అనే గొడుగు కింద భారతీయులందరినీ ఐక్యం చేసిన ఉద్యమంలో కాంగ్రెస్‌ పార్టీ భాగంగా ఉంది. అదే సమయంలో అది సమాజంలో సంస్కరణలను కూడా ప్రోత్సహించింది.
ప్రతిపక్షాలు ఏదో విధంగా అధికారాన్ని కోరుకుంటున్నాయని అమిత్‌ షా చాలా ఆలస్యంగా చెప్పాడు. ”మీరు సనాతన ధర్మాన్ని, ఈ దేశ సంస్కృతిని, చరిత్రను అగౌరవపరుస్తున్నారని” ఆయన అన్నాడు. వాస్తవం ఏమంటే, భారత జాతీయోద్యమం భారతీయ సంస్కృతి యొక్క అత్యున్నత అంశాలను సమర్థించింది. మన ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ‘ద డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో ఇలా అన్నాడు… ”ఆమె (భారత్‌), రాత చెరిపి దాని మీద రాసే పురాతన రాత ప్రతి లాంటిది. అయినా కానీ, ఆ తరువాత ఏ రాతలు కూడా, అంతకు ముందు రాసిన రాతలను కనిపించకుండా చేయలేవు లేదా చెరిపివేయలేవు.” సమస్య, ఇండియా కూటమిలో భాగస్వాములైన పార్టీలతో లేదు. బ్రాహ్మణీయ గతం, దానితో పాటు వచ్చే ప్రతీదాన్ని కలిగి ఉన్న బీజేపీ అండ్‌ కంపెనీతోనే సమస్య.
వాస్తవానికి, కుల వ్యవస్థ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. అంబేద్కర్‌, పెరియార్‌, చివరకు గాంధీజీలు చేపట్టిన పోరాటాలు గొప్ప ప్రారంభాలే కానీ అవి సగంలోనే నిలిపివేయ బడినాయి. కానీ గత మూడు దశాబ్దాలుగా సంపాదించినవన్నీ తారుమారు అయ్యాయి. ఉపయోగించబడిన పదజాలం గురించి వాదులాడు కోవడం కంటే కూడా కులాన్ని నిర్మూలించడానికే సమయం ఆసన్నమైంది.
నిజానికి, సనాతన అనే పదం దీర్ఘకాల ప్రయాణం చేసింది. బౌద్ధ మతం, జైన మతంలో దాని ప్రయోజనంతో ప్రారంభమై, చివరకు దాని స్థానాన్ని మనుస్మృతిలో కనుగొనడంతో, ప్రస్తుత కాలంలో బ్రాహ్మణీయ హిందూ మతానికి చిహ్నంగా మారింది. చిన్న చిన్న పొరపాట్లను వెతికి, దానిని ఓ రాజకీయ సమస్యగా మార్చేదాని కంటే కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా సమానత్వం గల ఒక సమాజం కోసం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానితోపాటు, కచ్చితంగా చెప్పాలంటే, ఉదయనిధి వ్యాఖ్యలు ఇండియా కూటమికి సంబంధించినవి కావు, బీజేపీ దానిని ఎన్నికల అంశాలుగా మార్చుతుందా అనేది చూడాలి. కర్నాటకలో బీజేపీ భజరంగబలిని ఉపయోగించుకునే ప్రయత్నం చేసి, మొహం పగుల గొట్టుకున్న విషయాన్ని గుర్తుచేసుకుందాం.
(”న్యూస్‌ క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451

రామ్‌ పునియానీ