111 జీఓ రద్దుతో 84 గ్రామాలకు శాశ్వత విముక్తి

పెరగనున్న భూముల ధరలు సుప్రీంకోర్టు , గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్‌ లోఉండగా రద్దు సాధ్యమా ? ఎన్నికల స్టంట్‌ : ప్రతిపక్షాల ఆరోపణ
నవతెలంగాణ- శంషాబాద్‌
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని 84 గ్రామాల్లో అమల్లో ఉన్న 111 జీవో రద్దు చేస్తూ తెలం గాణ ప్రభుత్వం శాశ్వత విముక్తి కల్పించింది. గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి జీవో 111 ఎత్తివేస్తూ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అన్ని రకాల అనుమతులు వర్తిస్తాయని ప్రకటించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్‌ చొరవతో సీఎం 111 జీవో ఎత్తివేశారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో ఎత్తివేత పట్ల సామాన్య జనం నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న 111 జీఓ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందా లేదా అనే ఆలోచన కూడా చేస్తున్నారు.
111 జీఓ తీసుకురావడానికి కారణం ఏమిటి ?
హైదరాబాద్‌కు తాగునీరు, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం నాటి నిజాం ప్రభుత్వం హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జంట జలాశయాలు నిర్మించింది. 1996లో శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్ద షాపూర్‌లో సురానా ఇండిస్టీస్‌ నిర్మాణం నిలిపివేస్తూ జీవో తీసుకువచ్చారు. దీంతో శంషాబాద్‌, శంకర్‌పల్లి, గం డిపేట్‌, మొయినాబాద్‌, కొత్తూరు, చేవెళ్ల మండలాలలోని 84 గ్రామాల్లో 111 జీఓ అమల్లో ఉన్నది. ఈ పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా జీఓ అడ్డుపడుతుంది. టీడీపీ హైటెక్‌ సిటీ నిర్మాణం, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంచ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంపై దృష్టి మళ్లింది. వేరే మండలాల్లో ఉన్న భూముల ధరలకు ఇక్కడ భూముల ధరలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండ డంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. 111 జీఓ పరిధిలో నిర్మాణాలు చేస్తే వెంటనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు అంటూ తొలగించారు. అయినప్పటికీ బలవంతంగా వేల ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. అయితే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తోపాటు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 111 జీఓ ఎత్తివేస్తామని ప్రకటించారు. ఈ జీవో ఎత్తివే యాలని బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో పాటు మరి కొంతమంది కమిటీగా ఏర్పడి గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ అంశాలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో 111 జీఓ ఎత్తివేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ఎత్తివేత విధివిధానాల గురించి మంత్రి మండలి ఉప సంఘం ఏర్పాటు చేసింది. బదులుగా 69 జీవోను విడుదల చేసి 111 జీవో నిబంధనలు కూడా వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జీవో ఎత్తివేస్తే ఏర్పడే సాంకేతిక అంశాలను పరిగణనలోకి ప్రభుత్వం ఇటీవల కాలంలో జంట జలాశయాలను తీవ్రంగా ప్రభా వితం చేసే గ్రామాలను గుర్తించి 800 కోట్లతో ఎస్టిపిలను నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరానికి మంజీరా, కృష్ణ, గోదావరి నుంచి తాగునీరు సరఫరా జరు గుతుందని జంట జలాశయాల నీటి వినియోగం అవసరం లేదని ప్రకటించింది. అయినప్పటికీ జంట జలాశయాలను కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా కాపాడుతామని కాలేశ్వ రం జలాలతో రెండు జంట జలాశయాలను అనుసంధానం చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో శంషాబాద్‌ మండలంలో 111 జీవో ఎత్తివేత పై హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న 111 జీవో అంశం రాష్ట్ర ప్రభుత్వం తొలగించే హక్కు ఉంటుందా ఇది ఎన్నికల జిమ్మిక్కా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
భూముల ధరలకు రెక్కలు
        111 జీవో రద్దుతో భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ హైదరాబాద్‌ నగరానికి అత్యంత సమీ పంలో ఉండడం కలిసి వచ్చే అంశం. మధ్యతరగతి ప్రజలు ఇళ్లస్థలాలు కొనుక్కో లేని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది.
అధికార పార్టీ బినామీల కోసమే 111 జీఓ రద్దు
111 జిఓ ఉన్న గ్రామాల లో ఇప్పటికే అధికార పార్టీ బినామీలు వందల ఎకరాలు భూములను తక్కువ ధరలకే కొనేసుకున్నారు. వాటితో వ్యాపారం చేసుకోవ టానికే 111 జీఓ ఎత్తివేత డ్రామాలు ఆడుతున్నారు. జీఓ 69 విధివిధానాలు ప్రజల తెలియజేయాలి. ఓట్ల కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారు.

– రాచమల్ల జయసింహ, బీఎస్పీ రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అధ్యక్షులు,
111 జీఓ ఎత్తివేత ఎన్నికల స్టంట్‌
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 111 జీఓ రద్దు చేసింది. ఇది ఎన్నికల స్టంట్‌ తప్ప మరొకటి కాదు. 111 జీ ఓ అంశం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలో ఉన్నది. వీటిని కాదని రాష్ట్ర ప్రభుత్వం జీవో రద్దు చేయడం అంటే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. 84 గ్రామాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇస్తామన్న జీవో విడుదల చేయాలి.
– మాదిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా శంషాబాద్‌ మున్సిపాలిటీ అధ్యక్షులు.

రైతులకు, పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలి
ప్రభుత్వం రద్దు చేసిన 111 జీవో రైతులకు, పర్యావరణంకు మేలు చేసేదిగా ఉండాలి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కాదు. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రజలను మబ్య పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే 111 జీఓ రద్దు. కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం ఖాయం.
– గడ్డం శేఖర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ శంషాబాద్‌ మండల అధ్యక్షులు