317 జీవో బాధితులకు శాశ్వత పరిష్కారం

– త్వరలోనే సీఎంకు తుది నివేదిక అందిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అతి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించి తుది నివేదికను రూపొందించి సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తామని చెప్పారు. 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందొద్దని కోరారు. శనివారం హైదరాబాద్‌లో 317 జీవో బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లాల విభజన, జోన్లు, మల్టీజోన్లు, స్పౌజ్‌ బదిలీలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 317 జీవో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సూచనలు, ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నామని వివరించారు.