– బుక్ మై షోపై మాదాపూర్ పీఎస్‌లో కేసు : అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి
నవతెలంగాణ-మియాపూర్
కొత్త సంవత్సరం వేడుకలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి ఉండాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘సన్ బర్గ్’ అనే సంస్థ ఎలాంటి అనుమతులూ లేకుండా బుక్ మై షో ద్వారా కొత్త సంవత్సరం కార్యక్రమానికి టికెట్లను విక్రయిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. సదరు సంస్థపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టొద్దని వివిధ సంస్థలకు, నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, మాదాపూర్ సీఐ తిరుపతి తదితరులు ఉన్నారు.