ముస్లింలపై వేధింపులు

ముస్లింలపై వేధింపులు– హౌలీ పేరుతో రంగులు చల్లి.. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు
– యూపీలో రెచ్చిపోయిన హిందూత్వ మూకలు..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో హిందూత్వ మూకలు రెచ్చిపోయాయి. హౌలీ పేరుతో ముస్లింలను వేధించిన ఘటన ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని బిజ్నోర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హౌలీ వేడుకల పేరుతో హిందూత్వ మూకలు ముస్లిం వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను వేధిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలు కనిపిస్తున్నాయి.వివరాల ప్ర కారం.. ఇద్దరు మహిళలతో బైక్‌పై వెళుతున్న ముస్లిం వ్యక్తిని హిందూత్వ మూకలు చుట్టుముట్టారు. స్ప్రేయర్‌తో మహిళలపై రంగు నీళ్లు చల్లారు. మహిళలు అరుస్తున్నప్పటికీ వారిని వేధిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత బక్కెట్లతో రంగు నీళ్లు వారిపై పోశారు. కొందరు యువకులు ముస్లిం వ్యక్తితో పాటు ఓ మహిళ ముఖంపై బలవంతంగా రంగు పూశారు. ”ఇది 70 ఏండ్లుగా వస్తున్న హిందూ సాంప్రదాయం” అంటూ ఆ మూకలు నినాదాలు చేయడం కనిపిస్తోంది. అనంతరం జైశ్రీరామ్‌ అంటూ వారిని విడిచిపెట్టారు.వీడియో వైరలైన అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులను బిజ్నోర్‌ పోలీస్‌ చీఫ్‌ నీరజ్‌ కుమార్‌ జాదౌన్‌ ఆదేశించారు. ధాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగిందని, నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అనిరుధ్‌ అనే వ్యక్తితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.