డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీయం నిరంతరం ఉల్లంఘనలకు పాల్పడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే ఆ సంస్థ అంశంలో వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు లేవన్నారు. తరచుగా నిబంధనలను ఉల్లంఘించటం వల్లనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమస్య తీవ్రతను బట్టే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పేటీయంపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు. కాగా.. ఏ విషయంలో పేటీయం నిబంధనలను పాటించలేదనేది దాస్ చెప్పడానికి నిరాకరించారు. బాధ్యతాయుత నియంత్రణ సంస్థగా ఉన్న ఆర్బీఐ వివిధ కంపెనీలతో పరస్పర అవగాహనతో పని చేస్తుందన్నారు. నిబంధనలు అమలు చేయడానికి తగినంత సమయం ఇస్తామన్నారు. పేటీయంకు నిబంధనలకు కట్టుబడి ఉండడానికి ఆ కంపెనీకి కూడా సరిపడా సమయం ఇచ్చామన్నారు. నిబంధనలు పాటించడంలో ఏ స్థాయిలో విఫలమైతే రిజర్వ్ బ్యాంక్ తీసుకునే చర్య కూడా అదే స్థాయిలో ఉంటుందని దాస్ స్పష్టం చేశారు. ఫిన్‌టెక్, ఇన్నోవేషన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో రిజర్వ్ బ్యాంక్ నిబద్ధతపై ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. గురువారం బిఎస్‌ఇలో పేటీయం షేర్ 9.99 శాతం పతనమై రూ.446.65 వద్ద ముగిసింది.