మద్యం తాగొద్దని భార్య వాదించడంతో గడ్డి మందు (పురుగుల మందు) తాగిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ సంఘటన దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గురువారం దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పంజ పంజా శ్రీనివాస్ రాజమణి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.6 నెలల కిందట శ్రీనివాస్(49) గుండె సంబంధిత అపరేష్ జరిగింది. అప్పటి నుండి డాక్టర్లు మద్యం,కల్లు తాగోద్దని సూచించారు. ఈ నెల 22 న శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య డాక్టర్లు ఆరోగ్యం నయం అయ్యే వరకు మద్యం, కల్లు తాగోద్దని చెప్పిన ఎందుకు తాగొచ్చావ్ అని వాదించింది.నువ్వు నాకు చెప్తావా అంటూ బెదిరించి మరుసటి రోజు ఉదయం కనబడలేదు. కంగారు పడి భార్య కుటుంబీకులతో కలసి వెతకగా తన వ్యవసాయ పొలం వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి 108 లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు.