అంగట్లో వ్యక్తిగత డేటా

– 16.8 కోట్ల మంది వివరాలు చోరీ..విక్రయం
– దేశంలో అతిపెద్ద సైబర్‌ స్కామ్‌
– ముఠా అరెస్టు : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
అతిపెద్ద సైబర్‌ స్కామ్‌ను సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దేశంలోని 16.8 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటాతోపాటు ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన, గోప్యమైన డేటాను చోరీ చేసి విక్రయించిన ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరా బాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు సైబర్‌ కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా విచారణ చేపట్టి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిని నాగ్‌పూర్‌, ఢిల్లీతోపాటు ముంబయికి చెందిన ముఠాగా గుర్తించారు. చోరీకి గురైన డేటాలో ఆర్మీకి చెందిన రెండు న్నర లక్షల మంది డేటా కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.
కీలక రంగాల వ్యక్తుల డేటా చోరీ
దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరిస్తు న్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైందని, కోట్లాది గా సోషల్‌ మీడియా ఐడీలు, పాస్‌ వర్డ్‌లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండు న్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. కేటుగాళ్లు ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ కార్డు లు, లోన్‌ అప్లికేషన్ల నుంచి వివరాలు సేకరి స్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందను కున్న బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తు న్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్టు చేశామని సీపీ వివరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారి స్తామని తెలిపారు. అలాగే ఈ విషయంపై కేంద్ర హౌం శాఖకు కూడా లేఖ రాస్తామని సీపీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనికి సంబం ధించి జస్ట్‌ డయల్‌ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసు విచారణకు అంతర్గతంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్‌ సీపీ కల్మేశ్వర్‌ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది. రక్షణ సిబ్బంది వివరాలు, పౌరుల మొబైల్‌ నంబర్లు, నీట్‌ విద్యార్థులు, ఎనర్జీ అండ్‌ పవర్‌ సెక్టార్‌, పాన్‌ కార్డ్‌ డేటా, ప్రభుత్వ ఉద్యోగులు వంటి కొన్ని ముఖ్యమైన, సున్నితమైన కేటగిరీలు సహా 140 కంటే ఎక్కువ కేటగిరీల సమాచారాన్ని విక్రయించారు. గ్యాస్‌ అండ్‌ పెట్రోలియం, హెచ్‌ఎన్‌ఐలు, డి-మ్యాట్‌ ఖాతాలు, విద్యార్థుల డేటాబేస్‌, ఉమెన్‌ డేటాబేస్‌, బెంగళూరు ఉమెన్‌ కన్స్యూమర్‌ డేటా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల డేటా, బీమా, క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ హోల్డర్‌లు, వాట్సాప్‌ యూజర్లు, ఫేస్‌బుక్‌ యూజర్లు, ఐటీ సంస్థ ఉద్యోగులు, తరచూ విమానాలు నడిపేవారు, జస్ట్‌ డయల్‌, ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిందితులు డేటాను విక్రయిస్తున్నారు. ఎవరైనా జస్ట్‌ డయల్‌ టోల్‌-ఫ్రీ నంబర్‌లకు కాల్‌ చేసి, వ్యక్తుల, ఏదైనా రంగం లేదా వర్గానికి సంబంధించిన రహస్య డేటా కోసం అడిగినప్పుడు, వారి ప్రశ్న జాబితా చేస్తారు. ఆ సేవా ప్రదాత వర్గానికి పంపిస్తారు. ఈ మోసగాళ్లు ఆ ఖాతాదారులకు, మోసగాళ్లకు కాల్‌ చేసి వారికి నమూనాలను పంపుతారు. క్లయింట్‌ కొనుగోలు చేయడానికి అంగీకరిస్తే, వారు చెల్లింపు చేసి డేటాను అందిస్తారు. ఈ కేసులో నిందితుల ముఠా రిజిస్టర్డ్‌, రిజిస్టర్‌ కానీ మూడు కంపెనీల డేటా మార్ట్‌ ఇన్ఫోటెక్‌, గ్లోబల్‌ డేటా ఆర్ట్స్‌, ఎంఎస్‌ డిజిటల్‌ గ్రో ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ నిందితుల వద్ద రక్షణ సిబ్బందికి సంబంధించిన వారి ర్యాంక్‌లు, ఇ-మెయిల్‌ ఐడీలు, పోస్టింగ్‌ స్థలం మొదలైన సున్నితమైన డేటా లభ్యమైనట్టు సీపీ వెల్లడించారు.