– ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయకపోతే జూలై 22వ తారీకు న కలెక్టరేట్ ముట్టడిస్తాం
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే జూలై 22వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని నిజామాబాద్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలియజేశారు. ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని, గాంధీ చౌక్ నుండి అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా గురువారం నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఆశాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి కనీసం ప్రభుత్వం వేతనాలు అమలు చేసే విధంగా తాను అసెంబ్లీ సమావేశాలలో మీ సమస్యల పట్ల లేవనెత్తుతాను అని హామీ ఇచ్చారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, 2024 ఫిబ్రవరి 9న ఆరోగ్య శాఖ కమీషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/-లు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా (ది. 09-10-2023న) హైదరాబాద్, కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించాం. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వీటితోపాటు పెండింగ్ పిఆర్సి ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని, సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని, ఇతర పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని హామీనిచ్చారు.
డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీనిచ్చింది. 2024 ఫిబ్రవరి 9న ఆరోగ్య శాఖ కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ఆశాల ధర్నా, చర్చల సందర్భంగా కమీషనర్ స్పందిస్తూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిజిస్టర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. అంశాల్లో ఒక్క సమ్మెకాలం వేతనాలు మాత్రమే ప్రభత్వం చెల్లించింది. ఇతర సమస్యలు నేటికీ పరిష్కారంచేయలేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు అనేకసార్లు ఆరోగ్య శాఖామంత్రి, ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులకు అనేక విజ్ఞప్తులు తెలియజేశాము. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనా-పోరాటాలు నిర్వహించాము. అయినా తమ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున పై అంశాలను పరిశీలించి, పరిష్కారం చేయాలని పలు డిమాండ్స్ ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలియజేశారు. సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, ఫిబ్రవరి 9న ఆరోగ్య శాఖ కమీషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకనుగుణంగా పారితోషికాలను రూ.18,000/- లకు పెంచి, ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఆశాలకు నష్టం కల్గించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. బిసిజి సర్వే, వ్యాక్సినేషన్‌కు పనికి తగ్గ పారితోషికం నిర్ణయించాలి. ఒకవేళ నిర్ణయించకపోతే ఈ పనిని రద్దు చేయాలి.గతంలో ఇచ్చినట్లు ఆశాలకు ప్రతినెలా 2వ తేదీన పారితోషికాలు చెల్లించాలి.
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలి.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలి.రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలి. అనేక సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న రిజిస్టర్సు అత్యంత తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలి. ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలి. ఆశాలకు 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి. ఆశాలకు ఏఎన్ఎం, జిఎన్ఎం ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలి.పారితోషికం లేని పనులు చేయించవద్దు. బిపి, షుగర్ టెస్ట్‌లు, ఎన్సిడి, అబా కార్డ్స్ తదితర ఏఎన్ఎంల పనులను ఆశాలతో చేయించవద్దు. 2021 జూలై నుండి డిశెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. 2022, 2023, 2024 సం॥ల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి. 16. 2024 మార్చి 3-5 వరకు 3 రోజుల పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన డబ్బులు వెంటనే చెల్లించాలి. టెన్త్, ఓపెన్ టెన్త్, ఇంటర్, ఓపెన్ ఇంటర్, డిగ్రీ, టెట్, గ్రూప్ 1,2 తదితర ఎగ్జామ్స్ సందర్భంగా ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలి. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జూలై 22వ తేదీన కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.