నేడు, రేపు కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు

నేడు, రేపు కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు– సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపులో భాగంగా డిసెంబర్‌ 11, 12 తేదీల్లో కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించనున్నట్టు ఆ మోర్చా రాష్ట్ర కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టీ.సాగర్‌, జక్కుల వెంకటయ్య, వెంకట్రావు, పద్మ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో రైతాంగ ఉద్యమ సమయంలో మోపబడిన కేసులను రద్దు చేయాలనీ, రైతు నాయకులపై నిర్బంధాలను ఆపాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు కేంద్ర చట్టాలను రద్దు చేయాలనీ, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలనీ, విద్యుత్తు సవరణ బిల్లు 2020 రద్దు చేయాలనీ, రుణమాఫీ చట్టం చేయాలని తదితర డిమాండ్లతో 13 నెలల పాటు సాగిన ఉద్యమ సమయంలో 730 మంది రైతులు చనిపోయారని తెలిపారు.వేలాది మంది రైతులపై అక్రమ కేసులు మోపబడ్డాయన్నారు.మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తామనీ, రైతు వ్యతిరేక మూడు కేంద్ర చట్టాలను రద్దు చేస్తామనీ, రైతు సంఘాలతో చర్చించి విద్యుత్తు సవరణ బిల్లుపై నిర్ణయం తీసుకుంటామనీ రైతులపై మోపిన కేసులను ఎత్తివేస్తామని ఉద్యమాన్ని ఆపాలని ప్రధాని స్వయంగా చేసిన విజ్ఞప్తిని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమని రైతు సంఘాలు అడిగిన విషయాన్ని గుర్తుచేశారు. వారి డిమాండ్‌ మేరకు లిఖిత పూర్వకంగా ప్రధానమంత్రి హామీలు ఇచ్చారని తెలిపారు. దాంతో తాత్కాలికంగా రైతాంగ ఉద్యమం ఆపినప్పటికీ నేటి వరకు లిఖితపూర్వకంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో మోపిన టువంటి కేసులకు సంబంధించి తిరగతోడుతూ రైతు ఉద్యమ నాయకులను నిర్బంధించడానికి ప్రయత్నిం చటం, వారి ప్రయాణాలను మార్గమధ్యంలోనే నిషేధించడం లాంటి దుర్మార్గమైన చర్యలకు కేంద్రపాలకులు పాల్పడటాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలోనే సంయుక్త కిసాన్‌ మోర్చా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి ఈ విషయాలను విన్నవించు కోవటానికి వినతి పత్రాలను ఇవ్వాలని పిలుపు నిచ్చిందని వివరించారు. అక్రమ కేసులునెత్తివేస్తామని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా తదితర రాష్ట్రాలు ప్రకటించినా అమలు చేయలేదని తెలిపారు. రైతాంగానికి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.