పెట్టి పొయ్యనమ్మ పెయ్యంత పునికిందట

- అన్నవరం దేవేందర్‌, కొందరికి మనసులో ఏమీ మమకారం ఉండదు. అయినా తియ్యగ నవ్వుకుంట మాట్లాడుతరు. ఇటువంటి వాళ్లను ‘పెట్టి పొయ్యనమ్మ పెయ్యంత పునికిందట’ అంటారు. పెట్టి పొయ్యడం అంటే మంచి భోజనం పెట్టడం అన్నట్టు. పెయ్యి అంటే దేహం పునుకుడు అంటే స్పశించుడు. అన్నం అయితే పెట్టదు గాని దగ్గర తీసుకొని తియ్యగ మాట్లాడడం. ఇంకో సామెత ‘పెడితే పెండ్లి కోరుతురు లేకుంటే చావు కోరుతరు’ కొన్ని స్నేహాలు గాని బంధుత్వాలు గానీ మనం వాళ్లను అరుసుకొని మర్యాదలు చేసినంత వరకే, మనకు వీలుకాక విస్మరించేదుంటే అవాకులు చవాకులు పలుకుతారు లేని పోనివన్నీ ముచ్చట్లు పెడతారు. అందుకే ‘పెట్టినమ్మ పుణ్యానికి పోదు, పెట్టనమ్మ పాపానికి పోదు’ అనే సామెత కూడా ఉన్నది. పాపం పుణ్యం స్వర్గం నరకం అనే వాటి సంగతి పక్కన పెడితే, ఇతరులకు పెట్టినోళ్లు పెట్టనోళ్లు ఒక్క తిరుగ జీవిస్తారని అర్థం.
అయితే పరస్పర గౌరవాలు మర్యాదలు బంధుత్వ ప్రేమలు సమాజా నడవడికి అవసరం. ఇట్లా మంది పెడితే తినేందుకు అలవాటు అయిన వారు ఒక్కో సందర్భంలో ‘పెట్టనమ్మ పెట్టకనే పాయె, పెట్టేటి అమ్మ ఎక్కడ చచ్చింది’ అని నోరు పారేసుకుంటరు. పెట్టని వాళ్లను అడగరు. పెట్టే వాళ్లనే తరచూ అడుగుతారు. అందుకే ‘కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అంటారు. అట్లనే మరొక సామెత ‘పెట్టే అమ్మకు బుద్ధి పుడితే ఏ బంతిలో ఉన్న తెచ్చిపెడుతది’ అంటారు. ప్రేమ ఉంటే ఎక్కడున్నా తెచ్చి పెట్టడం ఒక సహజమైన విషయం.
 – అన్నవరం దేవేందర్‌, 9440763479