పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని తొలగించాలి

– సీపీఎస్‌ను రద్దు చేయాలి :టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) చట్టాన్ని తొలగించాలని ఆల్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్‌), టీఎన్జీవో కేంద్ర సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లో బీమాభవన్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్‌ మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేయాలని కోరారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను విరమించుకోవాలని సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రచార కార్యదర్శి శైలజ, నాయకులు కట్టుకూరి శ్రీకాంత్‌, పంతులు హరికృష్ణ, మెట్టు నాగిరెడ్డి, వరలక్ష్మి, ప్రశాంతి, అవినాష్‌, దాస్‌, రమేష్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.