మార్చి 12న పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌

మార్చి 12న పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌– 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ
– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, ఫార్మా-డీ(పీబీ) కోర్సుల్లో 2024-15 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్టు గ్రాడ్యుయెట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ( పీజీఈసెట్‌) నోటిఫికేషన్‌ వచ్చేనెల 12న విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పీజీఈసెట్‌ కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్‌, జేఎన్టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పీజీఈసెట్‌ కన్వీనర్‌ ఎ అరుణకుమారి, కోకన్వీనర్‌ బి రవీంద్రారెడ్డి, కోఆర్డినేటర్‌ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు పీజీఈసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చేనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అరుణకుమారి తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు మే పదో వరకు ఉందని పేర్కొన్నారు. జూన్‌ ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు పీజీఈసెట్‌ రాతపరీక్షలను నిర్వహిస్తామని వివరించారు.